ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఈ వర్షాలతో సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సోమవారం రాత్రి నుంచి ఆమె విమానాశ్రయంలోనే ఉండిపోయింది. `ముంబై విమానాశ్రయం తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం ఇస్తారా?` అంటూ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు రకుల్ స్పందించింది. `సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా కదల్లేదు. నేను విమానాశ్రయంలోనే చిక్కుకుపోయాను` అని రిప్లై ఇచ్చింది. భారీ వర్షాల కారణంగా అనేక విమానాలను దారి మళ్లించారు. ఈ నెల ఐదో తేదీ వరకు ముంబైలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.