నిఖిల్‌తో నివేథా థామస్…

కేవలం నాయకానాయికల ఇమేజ్ మీదనే సినిమాలు ఆడవు.హీరోలను దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ సినిమాలు చేయను. కథలో వైవిధ్యంతో పాటు దర్శకుల వ్యక్తిగత ప్రతిభపై నమ్మకంతో ఒప్పుకుంటాను అని అంటున్నది నివేథా థామస్. జెంటిల్‌మన్, నిన్నుకోరి, 118 చిత్రాల్లో అభినయప్రధాన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందీ కేరళ సోయగం. నివేథా థామస్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం బ్రోచేవారెవరురా. వివేక్ ఆత్రేయ దర్శకుడు. నివేథా థామస్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి… బ్రోచేవారెవరురా సినిమా అంగీకరించడానికి కారణమేమిటి? వివేక్ ఆత్రేయ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను అంగీకరించాను. ఇందులో మిత్ర అనే ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిగా నా పాత్ర వైవిధ్యంగా సాగుతుంది. నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. మిత్రతో ఆర్ త్రీ అని పిలవబడే ముగ్గురు స్నేహితుల బృందానికి ఉన్న సంబంధమేమిటి? వారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి?ఒకరి సమస్యల్ని మరొకరు ఎలా పరిష్కరించారన్నది ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నేపథ్యమేమిటి? పలు సామాజిక అంశాలను స్పృశిస్తూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా కాకుండా తెరపై జీవితాల్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అనుబంధాలు, అప్యాయతల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పులు వచ్చాయి? మహిళలపై ఎలాంటి అకృత్యాలు జరుగుతున్నాయనే అంశాల్లోని పలు కోణాల్ని దర్శకుడు ఈ సినిమాలో వినూత్నంగా ఆవిష్కరించారు. ఇలాంటి మంచి కథల గురించి అందరికి తెలియజేయాలనే ఆలోచనతో నటించాను. ఇది మహిళా ప్రధాన చిత్రం అనుకోవచ్చా? పరిస్థితుల ప్రధానంగా సాగే కామెడీ డ్రామా ఇది. నాయకానాయికలు అనే భేదాలు లేకుండా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రల నేపథ్యంలో వచ్చే ప్రతి సన్నివేశం సరదాగా సాగుతుంది. ఇలాంటి స్నేహితులు మనకు ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా విరామం తీసుకొని సినిమాలు చేస్తున్నారు? సినిమాల్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో విరామం వచ్చిన భావన కలుగుతున్నది. ఓ సినిమా తర్వాత మరొకటి అంగీకరించాలన్నదే నా సిద్ధాంతం. కొన్ని సార్లు రెండు సినిమాలు చేయాల్సివస్తుంది. అంతకుమించి నటించను. నచ్చినవే చేయాలనే లెక్కలు నేను వేసుకోను. నాలో ఉత్సుకతను రేకెత్తించిన సినిమాల్ని అంగీకరిస్తూ ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ప్రతి పాత్ర కోసం పరిశోధన చేసిన తర్వాత షూటింగ్‌లో అడుగుపెడతాను. రజనీకాంత్ దర్బార్‌లో మీరు నటించబోతున్నట్లు తెలిసింది? రజనీకాంత్ సినిమా చేస్తున్నానో లేదో ఇప్పుడే చెప్పలేను. ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడుతాను. తెలుగులో మీరు అంగీకరించిన సినిమాలేవి? ప్రస్తుతం నిఖిల్‌తో శ్వాస సినిమా చేస్తున్నాను. ప్రీప్రొడక్షన్స్ వర్క్‌కు ప్రాధాన్యమున్న కథ కావడంతో చిత్రీకరణ ఆలస్యమవుతున్నది. అలాగే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న వి సినిమాలో నటిస్తున్నాను. రెండో షెడ్యూల్ పూర్తయింది. కథ వినకుండా మోహనకృష్ణపై ఉన్న నమ్మకంతో అంగీకరించిన చిత్రమిది. తెలుగుకే పరిమితం అవుతారా? ఇతర భాషల్లో నటించే ఆలోచన ఉందా?తెలుగులో సినిమా చేస్తానని అనుకోలేదు. జెంటిల్‌మన్ కథతోపాటు కొత్త భాషలో సినిమా చేయాలనే ఆసక్తితో అంగీకరించాను. తెలుగులో మంచి కథలు రావడంతో ఇతర భాషలపై దృష్టిసారించడం లేదు. తెలుగులో ప్రతిభావంతులైన నటీనటులు, దర్శకులతో పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. మీటూ ఉద్యమంపై మీ అభిప్రాయమేమిటి? మీటూ ఉద్యమం ఈ రోజు ప్రారంభమై రేపు ఆగేది కాదు. సినిమా ఇండస్ట్రీ అనేకాదు ప్రపంచంలోని అన్ని రంగాల్లో అమ్మాయిలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ధైర్యంగా ముందుకొచ్చి తమ అనుభవాల్ని చెబుతున్న వారిని గౌరవించాలి. సినిమా వాళ్లకు ఎక్కువ ప్రజాదరణ ఉండటంతో వారు ముందుకొచ్చి తమకు ఎదురైన అనుభవాల్ని చెప్పారు కాబట్టే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందాయి. సినిమా తారల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే నేను అస్సలు సహించను.

Leave a Response