జగన్ కేబినెట్లోదాదాపు రెండు వారాలుగా సాగుతున్న ఉత్కంఠకు నేడు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 30న ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జగన్ తన కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకోబోతున్నారనే దానిపై చాల ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా 25 మందితో జగన్ కేబినెట్ కొలువు దీరింది. అయితే కేబినెట్లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించి ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొన్న రోజాను జగన్ ఎందుకు దూరం పెట్టారో అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రోజాకు స్పీకర్ పదవి ఇస్తారని, లేని పక్షంలో మంత్రి పదవి గ్యారెంటీ అని పార్టీ గెలిచినప్పటి నుంచి ప్రచారం జరిగింది. అయితే శనివారం ఉదయం 11.49 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ ప్రమాణస్వీకారంలో రోజా పేరు ఎక్కడా వినిపించలేదు.. ఆమె కూడా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.