‘అన్ని పార్టీలకు మించి పోరాటం చేసాం. కానీ సమయం చాల్లేదు. మన దగ్గర డబ్బు లేదు. మిగతా పార్టీలన్నీ వద్దంటే డబ్బు పంచాయి. అందరినీ ప్రలోభపెట్టారు. ఇతర పార్టీలకు ఊరూ వాడా కమిటీలు ఉన్నాయి. మనకు అలాంటి కమిటీలు లేవు. ఉన్నదంతా ఫాన్స్ బలమే. వీరు కూడా సమయం తక్కువ ఉండటం వలన చొచ్చుకుపోలేకపోయారు. అందుకనే మనం ఓడిపోయాం. కాని, ఓట్లు మాత్రం 7% సాధించగలిగాం. ఇక ముందు మరోసారి మన తడాఖా చూపిద్దాం. లోకల్‌గా కచ్చితంగా ఈసారి ఎదుగుతాం’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా చెప్పుకొచ్చారు. సుమారు 4 గంటలపాటు సుదీర్ఘ సమీక్ష సాగింది. ఏలూరు, నరసాపురం పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన నాగబాబు, పెంటపాటి పుల్లారావు సహా 14 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
‘మీరంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఏమాత్రం మొహమాటం అవసరం లేదు. మనకి రియాల్టి తెలియాలి. మనకు మనం తీర్చిదిద్దుకుందాం.ప్రభుత్వ వ్యతిరేక ఓటు మన పార్టీకి దక్కలేదు. అదంతా వైస్సార్సీపీ జగన్ పార్టీకే దక్కింది. అందుకనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది’ అని పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న వారంతా ఎన్నికల్లో కష్టపడ్డారు. పార్టీ విజయానికి శ్రమించారు. కాని, ఏం చేస్తాం.. ఫలితాలు మనకు అనుకూలంగా రాలేదు. అయినా ఎవరూ అధైర్యపడొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ మనం పోటీ పడాల్సిందే.. అంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. లోపాలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన అన్నారు.
ఇన్‌చార్జ్‌లు మీరే..
పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలకు ఇక ముందు ఇన్‌చార్జ్‌లని పవన్‌కల్యాణ్ అన్నారు. అనుకోని విధంగా ఈ తరహా ప్రకటన వెలువడిన వెంటనే పోటీ చేసిన అభ్యర్థులంతా సంతృప్తిని వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒకటికి రెండుసార్లు పట్టుదలతో ప్రయత్నించాలి. ఆలోపే అన్ని ఏరియా లకు కమిటీలు వేయాలని ఆదేశించారు.
పట్టణ, గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి కావాలి. ఒకవేళ ఈ కమిటీల ఏర్పాటులో లోపాలు, వివాదాలు తలెత్తితే అదంతా జిల్లా కమిటీ చూసుకుంటుందని పవన్‌కళ్యాణ్ అన్నారు. ఒకవేళ ఆ కమిటీ ధైర్యం చేయలేకపోతే.. రాష్ట్ర కమిటీయే అసలు సంగతి తేలుస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని ఈ సందర్భముగా పవన్ కళ్యాణ్ అన్నారు.