డబ్బు వెదజల్లి తెరాస రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు. ఈ రోజు ఆయన నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సొంత ప్రయోజనాల కోసమే పలువురు పార్టీలు మారుతున్నారనీ.. ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. నగర పురపాలక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భముగా కుంతియా పిలుపునిచ్చారు.
మెజార్టీ మున్సిపాలిటీలు సాధించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కుంతియా అన్నారు. కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు ఉన్నారని.. ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడిపిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు గెలుపోటమిలు కొత్తకాదన్నారు. కాంగ్రెస్ బలహీన పార్టీ కాదని.. ఎంతో చరిత్ర కల్గిన బలమైన పార్టీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జ్యోతీష్యం చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.