పీజే అమరావతి : ఏపీ రాజధాని ప్రాంతంలో కృష్ణానది కుడివైపు కరకట్టకు దిగువన ఉన్న అక్రమ కట్టడాలు పై నిర్మాణదారులందరికీ నోటీసులను ఏపీసీఆర్డీయే సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీ సమాచారం. ప్రకాశం బ్యారేజీ నుంచి ఎగువకు తాళ్లాయపాలెం వరకు కృష్ణానది కరకట్టకు – నదికి మధ్యన వెలసిన సుమారు 50 వరకూ అక్రమ కట్టడాలను ఇప్పటికే సీఆర్డీయే గుర్తించింది. వాటికి బాధ్యులైన అందరికీ కొద్ది రోజుల్లోనే నోటీసులను అందజేయనున్నట్లు తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ఆనుకుని గత ప్రభుత్వం నిర్మింపజేసిన ప్రజావేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమ కట్టడంగా పేర్కొంటూ, దాని కూల్చివేతకు సోమవారం ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ చర్యను కక్షసాధింపుగా ఆరోపించిన టీడీపీ నేతలు, ఇదే విధానాన్ని కరకట్టకు దిగువన ఉన్న అన్ని ప్రైవేటు కట్టడాలకూ విస్తరిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో కరకట్టకు దిగువన ఉన్న అన్ని అనధికార కట్టడాలపైనా చర్యలకు తీసుకొనే విధంగా ముందుకు పోతున్నారని తెలుస్తోంది. సదరు నిర్మాణాలను తొలగించాలంటూ సీఆర్డీయేను ప్రభుత్వం ఆదేశించిందని సమాచారం. దీంతో సీఆర్డీయే అధికారులు వాటన్నింటికీ ఇచ్చేందుకు నోటీసులు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నోటీసులు అందుకోబోయే కట్టడాల్లో ప్రముఖులకు చెందిన అతిథిగృహాలు మొదలుకుని.. కొన్ని ఆశ్రమాలు కూడా ఉండబోతున్నాయని భోగట్టా. అయితే, ఇలాంటి నిర్మాణదారుల్లో సుమారు 30 మందికి సుమారు నాలుగేళ్ల క్రితమే సీఆర్డీయే నోటీసులు ఇచ్చింది. వాటిని అందుకున్న వారిలో కొందరు.. న్యాయస్థానాలను ఆశ్రయించారని తెలుస్తుంది.
తాజాగా.. సీఆర్డీయే ఇవ్వబోతున్న నోటీసులు ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని సిద్ధమవుతున్నాయని, వాటిల్లో ఆయా నిర్మాణాలను బాధ్యులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరనున్నారని తెలుస్తోంది. ఇందుకు కొంత గడువును ఇస్తారని, అది ముగిసేటప్పటికి తమకు తామే అతిక్రమణలను, అక్రమ నిర్మాణాలను తొలగించుకోని వారిని గుర్తించి, సదరు నిర్మాణాలను సీఆర్డీయేనే కూల్చివేయనుంది. ఈ మొత్తం ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న సీఆర్డీయే నోటీసుల తయారీ, జారీ, తదుపరి చర్యలను చకచకా చేపట్టేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.