ప్రభుత్వం తలచుకుంటే అదొక్కరోజు పనే!

రాష్ట్ర ప్రభుత్వం  తలచుకుంటే ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవకతవకల వ్యవహారం ఒక్క రోజులోనే పరిష్కారమవుతుందని తెజస అధ్యక్షుడు కోదండరాం స్పష్టంచేశారు. ఇంటర్‌ ఫలితాల తీరుపై ముగ్ధూం భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, తెదేపా, తెజస, సీపీఐ నేతలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రిని, ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తోందన్నారు. కనీసం అధికారులు కూడా ఒక్క సమాధానం చెప్పని పరిస్థితిని, సంబంధిత వ్యక్తులపై చర్యలకు పూనుకోని వైనాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. గ్లోబరీనా అనే ఒక్క సంస్థను వెనకేసుకు రావడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా కృషిచేయడం ఎన్నడూ చూడబోమన్నారు. గ్లోబరీనాను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఇంటర్‌ బోర్డు ఇంకా బోనులోనే ఉందన్నారు.

 

Leave a Response