ముమ్మడివరం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఆర్నెళ్లు కూడా కాలేదు అయినా ఎన్నికల హామీల్లో 80శాతం అమలు చేయడమే కాకుండా, 4లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, అయినా తనపై కుట్రలు పన్నుతున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని, అపనిందలు వేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికే టీడీపీ, జనసేనలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇక, ఏపీలో ఎలాగైనా బలపడాలనుకుంటోన్న బీజేపీ కూడా వైసీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వివాదానికి మతాన్ని జోడించి ఇటు టీడీపీ, జనసేన అటు బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం వెనుక మత మార్పిడుల కుట్ర ఉందంటూనే, జగన్ క్రిస్టియానిటీని ఎక్కువగా హైలేట్ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల విమర్శలూ దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మత కోణంలోనే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలకూ ఎవరి లక్ష్యాలు వాళ్లకున్నా, జగన్ ను ఎదుర్కోవడానికి ఒకే వేదికపైకి వచ్చే అవకాశముందంటున్నారు. అందుకే, ముమ్మడివరం సభలో ఎంతమంది శత్రువులు ఏకమైనా ఎదుర్కొనే సత్తా తనకుందంటూ జగన్ ప్రత్యేకంగా నొక్కి చెప్పారని అంటున్నారు.