ప్రాణాలంటే గాల్లో పెట్టిన దీపంలా…

గోలి బిల్ల లేక పేదవాడి గుండె ఆగిపోతుంది. చివరకు అత్యవసర మందులు కూడా లేకపోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.ప్రైవేటు మెడికల్ షాపులో మందులు కొనే స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిలువ లేక పేదవాడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పేద వారికి మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తోంది కాని నిర్వహణలో అన్ని లొపాలే అధికారులకు శాఖలకు మధ్య సమన్వయ లోపం రోగుల పాలిట శాపంగా మారుతుంది. ఇంత పెద్ద ఆస్పత్రిలో మందులు లేవు. కనీసం ప్రతి రోజూ అత్యవసరంగా ఉపయోగించే మందులు కూడా దొరకడం లేదు.దీంతో ఆస్పత్రికి వస్తున్న రోగుల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. పాము కాటు, తేలు కాటు ,కుక్కకాటు, పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించే అత్యవసర మందులు కూడా అందుబాటులో లేవంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక విధిలేని పరిస్థితుల్లో వందలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు మందుల షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు పేద రోగులు. ఈ దుస్థితి చూసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఎంజీఎం ఆస్పత్రి ఉత్తర తెలంగాణ జిల్లాలకు గుండెకాయలాంటిది.వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలతో పాటు చత్తీస్ ఘడ్ ,మహారాష్ట్ర నుండి కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు ప్రజలు.

Tags:mgm hospital

Leave a Response