ఈ నాలుగు చోట్ల జనసేన ప్రభావం పక్కా..!

  • కొత్తపేట, రాజమహేంద్రవరం, పిఠాపురం, తుని
  • జనసేన పోటీతో పలుచోట్ల ట్రయాంగిల్‌ ఫైట్‌
  • సమర్థులైన నేతల కోసం జనసేన అన్వేషణ
2019 ఎన్నికలలో జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ముక్కోణపు పోరు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ముఖాముఖి తలపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్నా ఎక్కడా కనీస డిపాజిట్లు దక్కలేదు. ప్రస్తుతం రాబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. తెలుగుదేశం, వైసీపీతోపాటు.. ఈ దఫా జనసేన కూడా ఎన్నికల బరిలోకి దిగుతోంది. పవన్‌ సినీ ఇమేజ్‌, సామాజికవర్గ ప్రభావంతో జనసేన కొన్నిచోట్ల ప్రభావం చూపించే అవకాశం ఉంది.
పవన్‌ కల్యాణ్‌ జిల్లా పర్యటన తర్వాత ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంలో కాస్త స్పష్టత వస్తోంది. ఆయా పార్టీలలో తమకు ప్రాధాన్యం దక్కడంలేదంటూ ఇప్పటికే పలువురు నేతలు జనసేనలో చేరారు. ఇటీవల వైసీపీ నుంచి జనసేనకు ఎక్కువగా ముఖ్య నాయకుల వలసలు జరిగాయి. పవన్‌ పర్యటనలోనూ ఒకరిద్దరు కీలక నేతలు జనసేనలో చేరబోతున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, వైసీపీ చాలాచోట్ల ముఖాముఖి తలపడే అవకాశం ఉంటుందని ఇన్నాళ్లూ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తూ వచ్చారు. జనసేన ప్రభావం పెద్దగా ఉండదన్న భావన వ్యక్తం చేసేవారు. రెండు, మూడు నెలలుగా ఈ పరిణామాలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పవన్‌ జిల్లా పర్యటన తర్వాత మరింత మార్పు రావచ్చు.
ఆ నాలుగు చోట్ల త్రిముఖం..
ఇప్పుడున్న పరిస్థితులలో జిల్లాలో కొన్నిచోట్ల వైసీపీ, టీడీపీతోపాటు.. జనసేన త్రిముఖ పోరులో ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్తపేట, రాజమహేంద్రవరం సిటీ, పిఠాపురం, తుని అసెంబ్లీ నియోజకవర్గాలలో జనసేన ప్రభావం మిగిలినచోట కంటే కాస్త ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. రాజమహేంద్రవరం సిటీ నుంచి త్వరలో బీజేపీ ప్రజాప్రతినిధి ఒకరు జనసేనలో చేరనున్నారని సమాచారం. సదరు నేత చేరికతో అక్కడ జనసేన మరింత బలపడే అవకాశం కన్పిస్తోంది. తుని నుంచి మాజీ ఎమ్మెల్యే ఒకరు జనసేనలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. టికెట్‌ హామీ ఇస్తే చేరడానికి సదరు నేత సిద్ధమవుతున్నారు. ఆయన చేరితే తునిలో వైసీపీ, టీడీపీలతోపాటు జనసేన పోటీలో ఉంటుంది. పిఠాపురంలోనూ జనసేన జోష్‌ బాగానే కన్పిస్తోంది. జిల్లాలో పలు ప్రాంతాలలో ఇటీవల వైసీపీ నుంచి జనసేనకు వలసలు జోరందుకోవడం ఈ పరిణామాలకు మరింత బలం చేకూరుస్తోంది.
2009 జోష్‌ వస్తుందా?
జిల్లా రాజకీయాలలో 2009 ఎన్నికల పరిస్థితి కొన్ని చోట్ల పునరావృత్తమయ్యేలా కన్పిస్తోంది. అప్పట్లో కాంగ్రెస్‌, టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగింది. ఆ ఎన్నికలలో పిఠాపురం, పెద్దాపురం, కొత్తపేట, కాకినాడ రూరల్‌లలో పీఆర్పీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రత్తిపాడు, రాజానగరం, మండపేట, రాజమహేంద్రవరం రూరల్‌లలో టీడీపీ గెలుపొందింది. ప్రజారాజ్యం చీల్చిన ఓట్లతో 2009లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనావేశారు.
ఇపుడు జనసేన చీల్చబోయే ఓట్ల ప్రభావం ఏ పార్టీకి లాభిస్తుంది? ఏ పార్టీకి మైనస్‌ అవుతుంది? అనే అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల నాటికి జనసేన మరింత పుంజుకుంటే ఎన్ని సీట్లు దక్కించుకోగలదు? అనేదానిపైనా జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీకి జిల్లాలో జోష్‌ వచ్చింది. మెజార్టీ సీట్లు గెలుస్తారంటూ పలు సర్వేలు సైతం వెల్లడించాయి. అయితే చిరంజీవి మీటింగ్‌లకు జనం వచ్చిన స్థాయిలో ఓట్లు పడలేదు. ఇప్పుడు ఆ స్థాయి జోష్‌ ఉందా? అదంతా ఓటింగ్‌ రూపంలో వస్తుందా? లేదా? అనేదానిపైనా జనసేనతోపాటు.. ఇతర పార్టీలు, విశ్లేషకులు అంచనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు.

Leave a Response