రాజకీయ ప్రయోజనాల కోసమే : మాయావతి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదేళ్ల పాలనలోని పాలను కప్పిపుచ్చుకోవడానికి జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులను ఉపయోగించుకుంటున్నారని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఆదివారం ఆమె లఖ్‌నవూలో తమ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… ‘జమ్ముకశ్మీర్‌లో  జరుగుతున్న ఉగ్రదాడులపై కొన్ని రోజులుగా దేశ మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు, భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ప్రధాని మోదీ.. ఆ రాష్ట్రంలోని పరిస్థితులను ఉపయోగించుకుంటూ తమ పాలనలోని లోపాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి బీఎస్పీ-ఎస్పీ ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్లాల్సి ఉందని మాయావతి తమ కార్యకర్తలకు తెలిపారు. ఎన్నికల వ్యూహం, ప్రచారం గురించి త్వరలోనే తాము తెలియచేస్తామని ఆమె తెలిపారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పాక్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దళం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులను మోదీ ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆమె ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు. మోదీ దేశ భద్రతపై దృష్టి పెట్టకుండా భాజపా ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోతున్నారని ఆమె విమర్శించారు. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఎస్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. యూపీలో మొత్తం 80 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లను ఆ కూటమి తమ మిత్రపక్షాలకు విడిచిపెడుతున్నట్లు తెలిపింది.

Leave a Response