ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే బలం లేకున్నా టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని బరిలో దింపడం అక్రమాలకు తెరతీయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అనైతిక ప్రయత్నాలకు అధికార పార్టీ పాల్పడకుండా ఉంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన చల్లా నర్సింహారెడ్డి గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కోటాలో గూడూరు నారాయణరెడ్డి, పట్టభద్రుల స్థానంనుంచి జీవన్‌రెడ్డిల విజయం ఖాయమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ గెలిచినా తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయంకోసం కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమించాలన్నారు.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గాన్ని దక్కించుకునేందుకు గాను కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమీక్షలు నిర్వహించడంతో పాటు పార్లమెంటరీ స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయిన తర్వాత మంచిర్యాలలో సమావేశం నిర్వహించనుంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్కలు హాజరై పట్టభద్రులు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.