ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ లో నటించేందుకు సినీ హీరోయిన్ సాయిపల్లవి ఒప్పుకోలేదట. తాజాగా ఓ ఇంటర్యూలో ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలో ఉన్నవారంతా ఒకే రంగులో ఉండరని తెలిపింది. అమెరికా, యూరప్ ప్రజలు తెల్లగా ఉంటారని… అఫ్రికన్లు నల్లగా ఉంటారని చెప్పింది. ప్రతి ఒక్కరూ రంగుతో సంబంధం లేకుండా అందంగానే ఉంటారని తెలిపింది. ఈ భావనతోనే ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ను తాను తిరస్కరించానని చెప్పింది. ఈ యాడ్ తో వచ్చే డబ్బు తనకు వద్దని తెలిపింది. తనకు పెద్ద పెద్ద అవసరాలు లేవని… ఇంటికెళ్లి మూడు చపాతీలు తిని, కారులో షికారు చేస్తే తనకు చాలని చెప్పింది. తనకు డబ్బు సంపాదన ముఖ్యం కాదని, తన చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడమే తనకు ప్రధానమని తెలిపింది.