307 పరుగులకు టీమిండియా ఆలౌట్‌ ఆసీస్‌ లక్ష్యం 323

అడిలైడ్‌: ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 307 పరుగులకు ఆలౌటైంది. 151/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మ్యాచ్‌ ప్రారంభించిన భారత్‌ నాలుగోరోజు 156 పరుగులు జోడించింది. పుజారా(71; 204బంతుల్లో), అజింక్య రహానె(70; 147బంతుల్లో) రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో టీమిండియా 323 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ముందుంచింది. భోజన విరామ అనంతరం రహానె మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. షమీ, ఇషాంత్‌ డకౌట్‌ అయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో లైయన్‌ ఆరువికెట్లు తీయగా.. స్టార్క్‌ 3, హేజిల్‌ వుడ్‌ ఒక వికెట్‌ తీశారు.

నాలుగో రోజు టీమిండియా ఆరంభంలో నిలకడగా ఆడింది. 88వ ఓవర్లో లైయన్‌ వేసిన బంతికి పుజారా(71; 204బంతుల్లో 9×4) ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్‌ శర్మ ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. దీంతో భోజన విరామ సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. లంచ్‌ తర్వాత భారీ షాట్లు బాదిన పంత్‌ త్వరగా పెవిలియన్‌ చేరాడు. 15 బంతుల్లో 28 పరుగులు చేసిన పంత్‌ 98ఓవర్లో లైయన్‌ వేసిన బంతిని ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అక్కడి నుంచి టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి అశ్విన్(5) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన రహానె(70; 147 బంతుల్లో 7×4) 104వ ఓవర్లో లైయన్‌ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో రహానె టెస్టు కెరీర్‌లో 16 అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ, ఇషాంత్‌ డకౌట్‌ కాగా బుమ్రా నాటౌట్‌గా నిలిచాడు.టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 250,ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ : 235

Leave a Response