15 రోజులు.. రెండు కోట్లు..?

తెలుగులో జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నది ముంబయి సోయగం పూజా హెగ్డే. వరుస స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న మహర్షి చిత్రంలో నటిస్తోంది. ఆమెను తాజాగా వాల్మీకి చిత్రం కోసం చిత్ర బృందం ఎంపిక చేసినట్లు తెలిసింది. తమిళ హిట్ చిత్రం జిగర్తాండ ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్నారు. హరీష్‌శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికిగాను పూజా పారితోషికం కింద రెండు కోట్లు డిమాండ్ చేసిందని, అది కూడా కేవలం పదిహేను రోజులకే అని తెలిసింది.

ఇటీవల అరవింద సమేత చిత్రానికి కోటిన్నర డిమాండ్ చేసిన పూజా హెగ్డే కథానాయికగా డిమాండ్ పెరగడం, తెలుగు స్టార్ హీరోలకు హీరోయిన్‌ల కొరత వుండటంతో ఏకంగా తన పారితోషికాన్ని రెండు కోట్లకు పెంచిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆమె డిమాండ్‌ని గుర్తించిన చిత్ర నిర్మాతలు పూజాహెగ్డే కోరిన పారితోషికాన్ని ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న చిత్రంతో పాటు బాలీవుడ్ చిత్రం హౌస్‌ఫుల్-4లో నటిస్తోంది.

Leave a Response