12వ సీజన్ ప్రారంభంలో ‘డాడీస్ ఆర్మీ’గా పిలిచిన విమర్శకుల నోర్లు మూయిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆ జట్టు ఎనిమిదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. చిరకాల ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్‌తో ఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయింది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్ వాట్సన్, డుప్లెసిస్ అర్ధశతకాలతో రాణించడంతో అలవోక విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ ఆనంతరం మాట్లాడాని ధోనీ విజయం సాధించడానికి గల కారణాలు వెల్లడించాడు.
‘మా విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. కీలక సమయాల్లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించారు. సరైన సమయంలో సరైన బంతులు వేసి పరుగులు చేయకుండా నియంత్రించారు. దిల్లీ జట్టుకు నాణ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. విశాఖలాంటి చిన్న మైదానంలో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. ఆ విషయంలో మా బౌలర్లు సఫలమయ్యారు. ఏ మ్యాచ్‌లోనైనా ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం కీలకం. ఆ జట్టులో ఎడమచేతివాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారు. అందుకే వాళ్లను కట్టడి చేసేందుకు మా జట్టులో ఎడమచేతివాటం బౌలర్లు ఉన్నారు. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి వాళ్లే ప్రధాన కారణం. ఛేదనలోనూ మా బ్యాట్స్‌మెన్ నిదానంగా ఆడారు. అయితే, మా ఓపెనర్లు ఆఖరి వరకూ క్రీజులోనే ఉండి మ్యాచ్ ముగిస్తే బాగుండేదనిపించింది. ఏదేమైనా మా జట్టు ఫైనల్‌కు చేరుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని ధోనీ పేర్కొన్నాడు.