‘మా చిత్ర పరిశ్రమను వదిలేయండి మోదీ’

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సతీమణి, కొరియోగ్రాఫర్‌ పోనీ వర్మ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఇటీవల మోదీని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో తమ చిత్ర పరిశ్రమను వదిలేయండంటూ పోనీ వర్మ మోదీని కోరుతూ ట్వీట్‌ చేశారు. నటీనటులు మోదీకి నో చెప్పలేకపోతున్నారన్న విషయం తనకు అర్థమైందని అన్నారు. ‘మా చిత్ర పరిశ్రమను వదిలేయాలని ప్రధానిని కోరుతున్నా. మీ ఎన్నికల కోసం మమ్మల్ని ఉపయోగించుకోకండి. నాకు వారి (మద్దతు తెలుపుతున్న నటీనటులు) పరిస్థితి అర్థమైంది, వారికి ఇష్టంలేకపోయినా.. మీకు నో ఎలా చెప్పగలరు. మీరు చివరికి ఖాన్స్‌తో ఇంటర్వ్యూ చేయించుకున్నా ఆశ్చర్యం లేదు. దయచేసి వారిని వదిలేయండి’ అని పోనీ వర్మ పేర్కొన్నారు.

బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాశ్‌రాజ్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రకాశ్‌రాజ్‌ రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు వారి బాధ తెలుసంటూ ఇటీవల పోనీ వర్మ భర్తకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఆయన దత్తత గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.

Leave a Response