నేడు స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తులుగా మార్చేందుకు అవసరమైన వ్యూహరచనను ఖరారు చేసే ఎజెండాతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమిళనాడు విపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అవుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నిన్న రాత్రి చెన్నై చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులు, ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌తో ఆయన పయనమయ్యారు. ఈరోజు ఉదయం సీఎం శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం 4.30కి డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు. కేసీఆర్‌ గతేడాది కరుణానిధితో పాటు స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సమాఖ్య కూటమి(ఫెడరల్‌ ఫ్రంట్‌)తో పాటు ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఆ తర్వాత తాను స్టాలిన్‌తో మాట్లాడుతున్నానని సీఎం వెల్లడించారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో పది రోజుల గడువు ఉన్న సమయంలో మరోసారి సమాఖ్య కూటమి ప్రతిపాదనపై సీఎం చర్చలకు తెరలేపారు. కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమిని ఆయన ప్రతిపాదిస్తుండగా.. కొన్నిపార్టీలు మద్దతు ఇస్తుండగా, మరికొన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డీఎంకే కాంగ్రెస్‌తో సానుకూలంగా వ్యవహరిస్తున్నా… మరోవైపు కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలకు మద్దతునిస్తోంది. కేంద్రంలో పరిణామాలెలా ఉన్నా… ప్రాంతీయ పార్టీల అవసరాలను వెల్లడించడం ద్వారా వాటికి ప్రాధాన్యం కల్పించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. గత వారం సీపీఎంకు చెందిన కేరళ సీఎం విజయన్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. వామపక్షాలు, తెరాసకు అంతగా సంబంధాలు లేవు. అయినా కేసీఆర్‌తో భేటీని విజయన్‌ స్వాగతించారు. ఆయన చర్చలు ప్రాధాన్యకరమైనవని తెలిపారు. స్టాలిన్‌ నుంచి కూడా ఈ తరహా స్పందనను కేసీఆర్‌ ఆశిస్తున్నట్లు తెలిసింది.

Leave a Response