దాసరి నారాయణరావు పుట్టినరోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. ఓ దర్శకుడికి ఇంతకంటే గొప్ప నివాళి ఉండద’’న్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. శనివారం దాసరి జయంతి సందర్భంగా తెలుగు దర్శకుల సంఘం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ ‘‘దాసరి గారితో చేసింది ఒకేఒక్క సినిమా. దర్శకుడిగా నాకు ఆయనతో అనుబంధం చాలా తక్కువ. కానీ వ్యక్తిగా మాత్రం మాది ప్రత్యేకమైన అనుబంధం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. మా ఇద్దరికీ చుట్టరికం కూడా ఉంది. వరసకు ఇద్దరం తాతామనవళ్లం అవుతాం. ఈ విషయాన్ని దాసరి గారు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. ఆయన చివరిరోజుల్లో మా బంధం మరింత బలపడింది. ‘ఖైదీ నెం 150’ వేడుక విజయవాడలో జరిగినప్పుడు ఆయన అతిథిగా వచ్చి ఆశీర్వదించారు. ఓరోజు ఇంటికి పిలిచి బొమ్మిడాయిల పులుసుతో భోజనం పెట్టారు. అల్లు రామలింగయ్య జాతీయ అవార్డును ఆయన ఇంటికి వెళ్లి నా చేతులతో అందించి వచ్చాను. తెలుగు పరిశ్రమలో చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు. వాళ్లలో దాసరి శైలి ప్రత్యేకం. అలాంటి దర్శకుడు మళ్లీ రాడు’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘం నిధికి ఆయన రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు బాగా వెలుగు వెలిగిన దర్శకులు చాలామంది ఇప్పుడు దయనీయమైన స్థితిలో ఉన్నారు. వాళ్లందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కనీసం రూ.5 కోట్లతో ఓ నిధిని ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. తన వంతుగా రాజమౌళి రూ.50 లక్షల విరాళం ఇస్తానని ప్రకటించాడు. నా వంతుగా 10 లక్షలు, బాహుబలి నిర్మాతల తరఫున 15 లక్షలు అందజేస్తాం. ఇద్దరు పిల్లల్ని కూడా చదివిద్దామనుకుంటున్నా. మిగిలిన అగ్ర దర్శకులు కూడా చేతనైనంత సహాయం చేస్తానని ముందుకు వచ్చారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్‌లతో పాటు చిత్రసీమలోని ప్రముఖ దర్శకులు పాల్గొన్నారు. తొలి చిత్రాలతోనే ప్రతిభను చాటుకున్న వేణు ఉడుగుల (నీదీ నాదీ ఒకే కథ), వెంకటేష్ మహా (కేరాఫ్ కంచరపాలెం), వెంకీ కుడుముల (ఛలో), అజయ్‌భూపతి (ఆర్.ఎక్స్ 100)లకు పురస్కారాలు అందజేశారు. అలాగే దర్శకులు జనార్దన మహర్షి, వి.ఎన్.ఆదిత్య తదితరులను కూడా సత్కరించారు.
previous article
నవంబర్‌లో నయన్ నిశ్చితార్థం?
next article
త్రిష.. మనం పెళ్లి చేసుకుందామా?
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment