‘దర్బార్‌’ చిత్రబృందంపై దాడి?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న ‘దర్బార్‌’ చిత్రబృందంపై దాడి జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఓ కళాశాలలో పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి సీన్లు బయటికి రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. కళాశాలలో చిత్రీకరణ జరుగుతుండడంతో విద్యార్థులు షూటింగ్‌ చూసేందుకు ఎగబడ్డారు. దాంతో చిత్రబృందం వారిని దూరంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో చిత్రబృందానికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో చిత్రబృందంపై వారు రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్‌ ఈ విషయం గురించి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారట.
అంతేకాదు.. వెంటనే షూటింగ్‌ లొకేషన్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘దర్బార్‌’ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో తలైవా ఖాకీ గెటప్‌లో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Response