పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, జనసేన కోశాధికారిగా పనిచేస్తున్న మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గురువారం పవన్ కల్యాణ్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీలోని అన్ని పదవులను వదులుకుంటున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టీడీపీతో జనసేన రహస్య సంబంధాలు నచ్చకే పార్టీని రాఘవయ్య వీడినట్టు జనసేనలో ప్రచారం జరుగుతోంది. రాఘవయ్యతో పాటు మరో నేత అర్జున్ కూడా జనసేనకు రాజీనామా చేశారు.
ఎన్నికల ఫలితాలు రాక మునుపే నాయకుల వరుస రాజీనామాలు లో కలకలం రేపుతున్నాయి. ఎప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వారిని పట్టించుకోకుండా, కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయడం వల్లే సీనియర్ నేతలు వెళ్లిపోవడానికి కారణమన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. మారిశెట్టి రాఘవయ్య ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. తనను పట్టించుకోకపోవడంతో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీకి ఆయన రాజీనామా చేశారు. మరోవైపు జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.