ఓ పక్క యాంకరింగ్‌తో మరో పక్క వరుస సినిమా అవకాశాలతో దూసుకెళుతున్నారు అనసూయ. ‘క్షణం’, ‘రంగస్థలం’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన అనసూయ.. మెగాస్టార్ చిరంజీవి నటించబోయే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారట. త్వరలో చిరు.. కొరటాల శ్రీనివాస్ తెరకెక్కించబోయే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయకు కీలక పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. కథానాయిక పాత్రకు సమానంగా అనసూయ పాత్ర ఉండబోతోందట.
ఈ మేరకు ఫిలిం వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ వినగానే వెంటనే ఆమె ఓకే చేసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆమె ‘కథనం’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాజేశ్ నాదెండ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొరటాల ప్రాజెక్ట్.. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పూర్తవగానే షురూ అవుతుంది. ఇంకా కథానాయిక ఖరారు కాలేదు.