ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మున్ముందు కాంగ్రెస్‌తో అంటకాగుతారని బాహాటంగా వెల్లడైంది. యూపీఏలో చేరుతున్న టీడీపీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడం సంతోషమని, కేవలం తెలంగాణాలోనే కాకుండా టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని పీటీఐ ఇంటర్వ్యూలో మొయిలీ స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం మంచి సంకేతమని, తెలుగుదేశం పార్టీతో మాకు మంచి అవగాహన ఉందని మొయిలీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు దిగడంపై తెలుగు రాష్ట్రాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులుకలపడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీతో తమ పార్టీ పొత్తు భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని వీరప్ప మొయిలీ బాహాటంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు పొత్తుకు పాకులాడటం సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు తావిస్తోంది.