ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైకాపా దూసుకెళ్తోంది. 150కి పైగా స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా సీనియర్‌నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 30న జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. ఎల్లుండి వైకాపా శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచిపెట్టి ఓట్లు పొందాలని చూశారని, అయినా ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదని ఉమ్మారెడ్డి విమర్శించారు.గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ బయల్దేరారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా జగన్ బృందం రాజ్‌భవన్ చేరుకొని గవర్నర్‌తో సమావేశం కానుంది. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన ప్రమాణస్వీకారోత్సవానికి జగన్ ఆహ్వానించనున్నారు. జగన్ వెంట పలువురు వైకాపా ముఖ్యనేతలు ఉన్నారు.
మరోవైపు, రేపు జగన్ హస్తినకు వెళ్లనున్నారు. ఉదయం 8.30గంటలకు బయల్దేరి దిల్లీకి వెళ్లి.. మధ్యాహ్నం 12గంటల సమయంలో జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.