అప్పుడు కాదని ఇప్పుడు ఓకే చెప్పిన స్వీటీ?

ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో అనుష్క నటించనున్నారా?అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కల్కి రచించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు మణిరత్నం సిద్ధమవుతున్నారు. భారీ మల్టీస్టారర్‌గా ఈ సినిమాను తీయబోతున్నారు. కోలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు ఇందులో సందడి చేయబోతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, విజయ్‌ సేతుపతి, జయం రవి, కీర్తి సురేశ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించనున్నారట. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు.
కాగా ఇందులోని ఓ పాత్రలో నయనతారను అనుకున్నారు. ఆమె కూడా దాదాపు నటించేందుకు సమ్మతించారు. అయితే విజయ్‌, రజనీకాంత్‌ సినిమా షూటింగ్‌లతో డేట్స్‌ కుదరక నయన్‌ తప్పుకున్నారట. దీంతో అనుష్కను మణిరత్నం సంప్రదించినట్లు సమాచారం. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత స్వీటీనే కలిశారు. కానీ అప్పుడు ఒప్పుకోకపోవడంతో నయన్‌ను తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో మళ్లీ అనుష్కతో దర్శక, నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. స్వీటీ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘భాగమతి’ తర్వాత అనుష్క ‘సైలెన్స్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.

Leave a Response