కళంక్’ సినిమా విజయం సాధించకపోవడం తన దురదృష్టమని బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా అన్నారు. ఆమె, ఆలియా భట్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆదిత్యా రాయ్ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఐదు రోజుల్లో విదేశాల్లో రూ.33 కోట్లు, భారత్లో రూ.66 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.
ఈ చిత్ర వైఫల్యం గురించి తాజాగా సోనాక్షి మీడియాతో మాట్లాడారు. ‘కళంక్’తోపాటు తన గత చిత్రాలకు కూడా ఆదరణ లభించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
‘నాకు ప్రతి సినిమా ముఖ్యమే. ప్రతి సినిమా హిట్ కావాలని ప్రార్థిస్తా. కానీ నా గత కొన్ని సినిమాలు ఆడకపోవడం నా దురదృష్టం. కానీ నేను ఆశలు వదులుకోను. ది బెస్ట్ కోసం ముందుకు సాగుతూనే ఉంటా. సినిమాల్ని నేను చాలా జాగ్రత్తగానే ఎంచుకుంటాను. కానీ బాక్సాఫీసు నా కంట్రోల్లో ఉండదు కదా. ఓ నటిగా నటన మాత్రం నా కంట్రోల్లో ఉంటుంది. నేను నటించిన ప్రతి సినిమా నాకు కొత్త విషయం నేర్పుతుంది. ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తాను. ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’కు సంతకం చేశా. జూన్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అందులో నాదిఓ అద్భుతమైన పాత్ర’ అని సోనాక్షి అన్నారు. మరోపక్క సోనాక్షి ‘దబాంగ్ 3’లో సల్మాన్ ఖాన్కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.