అందుకే ముంబయి ఛాంపియన్‌ అయింది : ధోనీ

మాకంటే ముంబయి ఇండియన్స్‌ తక్కువ పొరపాట్లు చేయడం వల్లే ఫైనల్‌లో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచిందని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ పేర్కొన్నాడు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగోసారి టైటిల్‌ కొట్టాలన్న చెన్నై ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, ఈ మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు కెప్టెన్‌ ధోనీ మాట్లాడాడు.
‘ఇది ఎంతో సరదాగా  సాగిన మ్యాచ్‌. ట్రోఫీని ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకరి నుంచి ఒకరం మార్చుకుంటున్నాం. అయితే, ఛాంపియన్‌ను నిర్ణయించే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో తప్పులు చేస్తే పరిహారం తప్పదు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ పొరపాట్లు చేశాయి. కానీ, ముంబయి మాకంటే ఒకటీరెండు పొరపాట్లు తక్కువగా చేసింది. ఛాంపియన్‌గా నిలిచేందుకు ముంబయి పూర్తి అర్హత ఉన్న జట్టు. అందుకే పైచేయి సాధించింది. మా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. ఈ పిచ్‌పై 150 పరుగులకే ప్రత్యర్థిని కట్టడం చేయడం సులువైన పనికాదు. వికెట్‌ అవసరమైన ప్రతీసారి బౌలర్లు వికెట్లు తీశారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఇది మంచి సీజన్‌. మిడిల్‌ ఆర్డర్‌లో కొంచెం విఫలమైంది. వీటన్నింటి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరం చాలా మంచి క్రికెట్‌ ఆడాం’ అని ధోనీ పేర్కొన్నాడు.

Leave a Response