అంతర్జాతీయ షోలో పవన్‌ పాటకు డ్యాన్స్‌

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి మరోసారి అంతర్జాతీయంగా వెల్లడయింది. ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ అనే అంతర్జాతీయ రియాల్టీ షోలో భారత డ్యాన్స్‌ గ్రూప్‌ ‘ది కింగ్స్‌’ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఫినాలే షోలో ‘ది కింగ్స్‌’ చేసిన డ్యాన్స్‌కు న్యాయనిర్ణేతలు జెన్సీఫర్‌ లోపేజ్‌, నీ-యో, డెరెక్‌ హూగ్‌ ఫిదా అయ్యారు. పవన్‌ నటించిన సినిమా ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’లోని ‘వాడెవడన్నా.. వీడెవడన్నా సర్దార్‌ అన్నకు అడ్డెవరన్నా..’ అనే పాటకు ‘ది కింగ్స్‌’ అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.
ఈ సందర్భంగా దేవిశ్రీ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ‘ది కింగ్స్‌’ కాకుండా మరో భారత డ్యాన్స్‌ గ్రూప్‌ ఓ పాపులర్‌ అమెరికన్‌ షోలో తను బాణీలు అందించిన ‘ఖైదీ నెంబరు 150’లోని ‘సుందరి..’ పాటకు డ్యాన్స్‌ చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఓ మైగాడ్‌.. ఎంత అద్భుతమైన ప్రదర్శన.. అప్పుడు ‘ఖైదీ నెంబరు 150’లోని ‘సుందరి’ పాటకు.. ఇప్పుడు ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’లోని ‘వాడెవడన్నా..’ పాటకు అంతర్జాతీయ డ్యాన్స్‌ స్టేజీపైన ప్రదర్శన ఇచ్చారు. నా సంగీతం ప్రజల్ని డ్యాన్స్‌ చేయించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ధన్యవాదాలు.. లవ్‌ యు  గాయ్స్‌. మీరు ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేశారు. కీప్‌ ‘రా‘కింగ్‌’స్‌’ అని ట్వీట్‌ చేశారు.

Leave a Response