తెలంగాణ గవర్నర్ తమిళసైను కలిసి ‘సైరా’ను చూడాల్సిందిగా అభ్యర్థించారు చిరంజీవి. ఆమె అంగీకారం తెలిపి ‘సైరా’ను తన కుటుంబ సభ్యులతో సహా కలిసి వీక్షించారు. 20 ఏళ్ల కాలంలో తాను రెండు సినిమాలే చూశాననీ, గతేడాది రజనీకాంత్ సినిమా ‘కాలా’ చూసిన తాను, ఇప్పుడు ‘సైరా’ చూశానని తెలిపారు తమిళసై. ‘సైరా’ సినిమా చాలా బాగుందనీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి గొప్పగా నటించారంటూ ప్రశంసించారు.ఆ తర్వాత సతీమణి సురేఖతో అమరావతి వెళ్లి మరీ ఏపీ చీఫ్ మినిస్టర్ వై.ఎస్. జగన్మోహనరెడ్డిని కలిశారు చిరంజీవి. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా కోరారు. ‘సైరా’ మేకింగ్ విశేషాలను ఆయనతో పంచుకున్నారు. రెండు మూడు రోజుల్లో వీలు చూసుకొని సినిమా చూస్తానని జగన్ మాటిచ్చారు. తాడేపల్లిలోని తన నివాసంలో మెగాస్టార్ దంపతులతో కలిసి మధ్యాహ్నం లంచ్ చేశారు జగన్. అంతేకాదు.. చిరంజీవికి ఆయన బొబ్బిలి వీణను కూడా కానుకగా ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ జగన్ ‘సైరా’ మూవీని తిలకించడం సాధ్యపడలేదు. బిజీ షెడ్యూల్ కారణంగానే సినిమాని చూసేందుకు జగన్కు సమయం లభించలేదని సమాచారం.ఆపైన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మినిస్టర్ అమిత్ షా అపాయింట్మెంట్ల కోసం చిరంజీవి ప్రయత్నించారు. దీనికోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు కూడా. పనిలో పనిగా చిరంజీవి అభ్యర్థన మేరకు తన నివాసంలో ‘సైరా’ మూవీని కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లయితే, చిరంజీవి మూడో కన్ను అంటూ ఆకాశానికెత్తేశారు వెంకయ్యనాయుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా అద్భుతంగా నటించారంటూ ప్రశంసించారు. చిరంజీవి కదలికలు, ఆయన కలుస్తున్న రాజకీయ నాయకులను గమనిస్తుంటే, బీజేపీలో చేరడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారా?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి రాజ్యసభ సీటును ఆశిస్తున్నారనీ, అందుకే మోదీ, షాలను కలవడానికి ప్రయత్నిస్తున్నారనీ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని మెగాస్టార్ సన్నిహిత వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన రాజ్యసభ సీటును ఆశించడం లేదని అవి చెబుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ‘సైరా’ను చూపించి, ఆ సినిమాకు మరింత ప్రచారం తీసుకు రావడానికే ఆయన వాళ్లను కలుస్తున్నరనీ, ఇందులో రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశం లేదనీ ఆ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ మోదీ, షాల అపాయింట్మెంట్ చిరంజీవికి లభిస్తుందా? అసలు చిరంజీవి మనసులో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధనం త్వరలోనే మనకు లభించవచ్చు.
Tags:Chiranjeevisaira narasimha reddy
previous article
‘గద్దలకొండ గణేష్’ తర్వాత హరీష్ చేయబోయే సినిమా ఏది?
next article
‘హిట్’ అనే టైటిల్ ఖరారు..!
Related Posts
- /
- /No Comment