వైసీపీలోకి వల్లభనేని వంశీ..!

వల్లభనేని వంశీ తన చిరకాల మిత్రుడు మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పేర్ని నానితో కలిసి మధ్యాహ్నం 3గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటకుపైగా జగన్‌తో చర్చలు జరిపారు. ఇటీవల వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన్ను 10వ నిందితుడిగా చేర్చారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని, దీనిపై ఆధారాలతో గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ విషయమై వంశీ జగన్ ని కలిసారని అంటున్నారు. మరోవైపు ఈ భేటీలో పార్టీ మారడంపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. వంశీ మాటలను బట్టి చూస్తుంటే పార్టీ మారటం ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయనకు పార్టీ మారే ఉద్దేశం లేకపోతే.. నేను టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పేవారు, అంతేకాని ఇలా దీపావళి తర్వాత స్పష్టత ఇస్తా అనేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ వర్గాల నుంచి కూడా ఇటువంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తానని సీఎంను కలిసిన సందర్భంగా వంశీ చెప్పారని, సీఎం కూడా సానుకూలంగా స్పం దించారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యేలెవరైనా వైసీపీలో చేరాలంటే ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలన్న జగన్‌ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశాయి. మరి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా?. ఒకవేళ చేరితే ఆయనను రాజ్యసభకు పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. వంశీని రాజ్యసభకు పంపి, వైసీపీ నేత యార్లగడ్డ వెంకటేశ్వర రావుని గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మరి దీనిలో నిజమెంత? వంశీ నిజంగానే వైసీపీ కండువా కప్పుకోనున్నారా అనేది దీపావళి తర్వాత తేలిపోనుంది.కాగా, శుక్రవారం టీడీపీ ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వంశీ పాల్గొనకుండా సీఎం తోనే భేటీ అయ్యారు. దీంతో వంశీ పార్టీ మారడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వంశీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. తాను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇంత స్థాయిలో తన మద్దతుదారులపైన, అనుచరులపైన దాడులు గానీ, ఆస్తులకు నష్టం గానీ జరగలేదని పేర్కొన్నారు. ఈ అంశాలను సీఎంకు వివరించానని చెప్పారు.

Tags:vallabhaneni vamsi

Leave a Response