ఇటీవల సెలబ్రిటీలు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. రాజశేఖర్‌కు జరిగిన ప్రమాద ఘటన మరువకు ముందే టాలీవుడ్ యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. శనివారం మూసాపేట నుండి బంజారాహిల్స్ వైపు వస్తున్న రవి కారుని భరత్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర ఓ డీసీఎం ఢీ కొట్టింది.ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను పట్టుకున్న రవి వారిని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. వారు తాగి బండి నడుపుతున్నట్టుగా అంగీకరించారని రవి వెల్లడించాడు. అయితే ఈ లోగా రవి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చే లోపు ఆ డ్రైవర్, క్లీనర్ డీసీఎంను అక్కడే వదిలేసి పారిపోయారు. డీసీఎం డ్రైవర్‌పై సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద వారి మీద కేసు రిజిస్టర్ చేసినట్టుగా తెలిపాడు రవి. అయితే ట్రాన్స్పోర్ట్ ఓనర్ తనను సంప్రదించాడని.. తాను జరిగిన నష్టాన్ని భరిస్తానన్నాడని రవి తెలిపాడు. తాను కారులో ప్రయాణిస్తుండగా జరిగింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. అదే డీసీఎం ఓ టూవీలర్‌ను ఢీ కొట్టినట్టయితే ప్రాణాలే పోయేవి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.