టాలీవుడ్ లో సినిమాలు నిర్మాత తండ్రితో సమానం. సినిమాకు కొబ్బరి కాయ కొట్టింది మొదలు సినిమాను థియేటర్‌కు తీసుకు వచ్చే వరకు నిర్మాత పడే టెన్షన్ మామూలుగా ఉండదు. పెద్ద నిర్మాతలకు స్టార్ హీరోస్ డేట్స్ ఇవ్వడం.. థియేటర్స్పై కమాండ్ ఉండటం వంటి కారణాలతో.. వారు నిర్మించే సినిమాల రిలీజ్‌కు పెద్ద సమస్యలు ఉండవు. అయితే చిన్న సినిమా విడుదల విషయంలో నిర్మాతల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.
ప్రస్తుతం ఉన్న సినిమాల మధ్య పోటీల కారణంగా చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడమే కష్టంగా మారింది. రోజుకు నాలుగు ఆటలు కాకుండా ఐదో ఆటకు అనుమతి ఇవ్వడమే కాకుండా, ఆ షోను చిన్న సినిమాలకు కేటాయించాలని చిన్న నిర్మాతలు ఎప్పటినుంచో ప్రభుత్వాలను కోరుతున్నారు. చిన్న నిర్మాతల అభ్యర్థనను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పరిశీలిస్తున్నాయి.

అయితే మన పక్క రాష్ట్రం తమిళనాడు ఈ విషయంలో ముందడుగు వేసింది. ఇప్పటికే అక్కడ మీడియం రేంజ్ సినిమాలకు కూడా స్పెషల్ షో అనుమతులు లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు 24 గంటలు థియేటర్స్‌ను ఓపెన్‌గా ఉంచబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఇలా చేయడం వల్ల నిర్మాతలు వారి వీలును బట్టి ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు వేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ మేర తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం.