కాలెండరులో ఆరు పేజీలు మారిపోయాయి. ఈ ఆరు నెలల్లో మూడు హిట్లు ఆరు సూపర్ హిట్లు అన్నట్లుగా బాలీవుడ్లో సందడి నెలకొంది. బాక్సాఫీసు వద్ద కొన్ని చిన్న చిత్రాలు చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోతే, మరికొన్ని అగ్ర కథానాయకుల చిత్రాలు పరిశ్రమకు ఆనందాన్ని పంచాయి. ఆ విశేషాలు ఏంటో చూసేయండి.జనవరిలో వచ్చిన ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’ సంచలనం సృష్టించింది. సోలో హీరోగా పెద్ద గుర్తింపు లేని విక్కీ కౌషల్ నటించడం, దర్శకుడు ఆదిత్య ధర్‌కు తొలి చిత్రం కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయ్యింది. అయితే బాక్సాఫీసు వద్ద ఆశ్చర్యకరమైన వసూళ్లు రాబట్టింది. మెరుపు దాడుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సుమారు రూ.245 కోట్లు వసూలు చేసి పరిశ్రమ వర్గాల్లో జోష్ నింపింది. అదే నెలలో వచ్చిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ కూడా మంచి విజయం సాధించింది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించింది. తెలుగు దర్శకుడు క్రిష్‌తో కలసి కంగన తెరకెక్కించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో విడుదలై సుమారు రూ.118 కోట్లు వసూళ్లు అందుకుంది.ఫిబ్రవరిలో వచ్చిన ‘గల్లీబాయ్’ జోరు చూపించింది. ర్యాప్ గాయకుల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించారు. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.140 కోట్ల వసూళ్లతో విజయాన్నందుకుంది. అదే నెలలో వచ్చిన ‘టోటల్ ధమాల్’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కాసులు కురిపించింది. అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ తదితరులు నటించిన ఈ మల్టీస్టారర్ చిత్రం సుమారు రూ.155 కోట్లు ఖాతాలో వేసుకుంది.‘లుకా చుప్పి’, ‘బద్లా’, ‘కేసరి’ చిత్రాలతో మార్చి నెల సందడిగా సాగింది. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ నటించిన రొమాంటిక్ కామెడీ ‘లుకా చుప్పి’ యువ ప్రేక్షకులను ఆకట్టుకుని దాదాపు రూ.95 కోట్లు వసూళ్లు అందుకుంది. ప్రతీకారం నేపథ్యంలో అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘బద్లా’ మెప్పించింది. స్పానిష్ చిత్రం ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రూ.88 కోట్లు వసూళ్లతో విజయ తీరాలకు చేరింది. చారిత్రక సారాగఢి యుద్ధం నేపథ్యంలో అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’ విజయ బావుటా ఎగరేసింది. సుమారు రూ.155 కోట్లు అందుకుంది.ఏప్రిల్ మాత్రం కాస్త నిరాశపర్చిందనే చెప్పాలి. ఈ నెలలో భారీ అంచనాలతో వచ్చిన ‘కళంక్’ చతికిలపడింది. వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ లాంటి ప్రముఖ తారాగణం ప్రధాన పాత్రల్లో నటించగా కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం మెప్పించలేకపోయింది. జాన్ అబ్రహమ్ నటించిన ‘రోమియో అక్బర్ వాల్టేర్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే ఈ నెలలో విజయం లేదనే లోటును హాలీవుడ్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తీర్చేసింది. ఈ చిత్రం ఇండియాలోనే రూ.370 కోట్లు కొల్లగొట్టడం విశేషం.విజయవంతమైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మేలో విడుదలైంది. టైగర్ ష్రాఫ్‌తో పాటు కొత్త నాయికలు అనన్య పాండే, తారా సుతారియా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. అదే నెలలో వచ్చిన ‘దే దే ప్యార్ దే’తో అజయ్ దేవగణ్ ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకున్నారు. ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్, టబు నటించిన ఈ చిత్రం నవ్వులు పూయించి రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. అర్జున్ కపూర్ నటించిన ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’, ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా వివేక్ ఒబెరాయ్ నటించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ ప్రభావం చూపించలేకపోయాయి. హాలీవుడ్ చిత్రం ‘అలాద్దీన్’ రూ.53 కోట్లకు పైగా వసూలు చేసింది.జూన్‌లో ‘భారత్’ రాకతో మళ్లీ బాక్సాఫీసు సందడిగా మారింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అదే నెలలో వచ్చిన ‘కబీర్ సింగ్’ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ నటించారు. మాతృకను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగాయే రీమేక్‌కూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లందుకుని ఇంకా జోరు కొనసాగిస్తోంది. వీటితో పాటు ‘ఆర్టికల్ 15’, ‘తాష్కెంట్ ఫైల్స్’ లాంటి చిత్రాలు వసూళ్లతో సంబంధం లేకుండా ప్రశంసలు అందుకున్నాయి.
previous article
రాధికా ఆప్టే బండారం బయటపెట్టేసింది
next article
విజయ్ దేవరకొండతోనే సినిమా…..
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment