వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై అతని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి దాడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మీడియాకు ఆయన వివరణ ఇచ్చారు. ‘జరిగిన సంఘటనను దగ్గరగా చూస్తే మీకే నిజాలు తెలుస్తాయి. నెల్లూరు జిల్లాలో ‘నుడా’, ‘రేరా’.. రెండు సంస్థల అనుమతులు ఉన్న ఏకైక లే-అవుట్ అది ఒక్కటే. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. దానికి అధికారిక అనుమతులు ఇచ్చి కూడా చాలా కాలం అయింది. మూడు నెలలుగా వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే నేను ఎంపీడీవో సరళ గారికి ఫోన్ చేసిన మాట వాస్తవమే.వాటర్ కనెక్షన్ ఇవ్వొచ్చుగా అని అడిగితే, ‘ఎమ్మెల్యేగారు ఇవ్వొద్దంటున్నారు సార్’ అని ఆమె సమాధానం చెప్పింది. ‘ఏ ఎమ్మెల్యే’ అని ప్రశ్నిస్తే, ‘మా ఎమ్మెల్యే గారు సార్’ అని ఆమె బదులివ్వడంతో ‘ మీ ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశానని అన్నారు. ‘వాళ్ల ఎమ్మెల్యేకు కూడా ఫోన్ చేశాను. వాళ్ల ఎమ్మెల్యే అంటే కాకాణి గోవర్థన్ రెడ్డి. ఎవరో కాదు స్వయానా నాకు బావే. నేను ‘గిరి’ అని అంటాను.‘గిరి.. మన జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల సొంత లే-అవుట్, అన్ని అనుమతులు ఉన్న లే-అవుట్. మూడు నెలల నుంచి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ఎంపీడీవో ఇబ్బంది పెడుతోంది. అదేమంటే, ‘నీ మీద చెబుతోంది’’ అని చెప్పాను. ‘దాంట్లో వేరే ఉందిలే, నీతో మెల్లిగా మాట్లాడతానులే’ అని అన్నాడు. ఇప్పటిదాకా నాతో మాట్లాడలేదు. అంత వరకే జరిగింది’ అని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.మా ఎమ్మెల్యే ఇవ్వొద్దన్నాడు’ అనే మాట ఎందుకు చెప్పింది? అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నించారు.