ఏపీ ప్రభుత్వం ఎవరిపైనో కక్ష తీర్చుకోవడానికో, ద్వేషంతోనో గత ప్రభుత్వ అవినీతి, అవకతవకలపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వ నిర్ణయాలవల్ల జరిగిన అవినీతిని నిరోధించి ప్రజాధనాన్ని కాపాడేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామని ఆయన తెలిపారు. తెదేపా హయాంలోని నిర్ణయాల నిగ్గుతేల్చేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి జగన్ ఆదివారం మొదటి సారి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం 3.15 నుంచి ఈ సమావేశం దాదాపు గంటన్నరపాటు సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతంరెడ్డి, పి.అనిల్‌కుమార్‌లతోపాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం కార్యాలయ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్, ఆదిత్యనాథ్ దాస్, శ్రీకాంత్, శ్యామలరావు, పి.వి.రమేష్, ధనుంజయ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. తొలుత మంత్రివర్గ ఉపసంఘం సభ్యులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. ఇది ఎవరిపైనో ద్వేషంతో చేస్తున్న పనో, కక్ష సాధింపో కాదని ఈ సందర్భము గా స్పష్టం చేశారు. ఈ సందేశం జనంలోకి వెళ్లాలని సమావేశంలో పాల్గొన్న వారికి స్పష్టంగా చెప్పారు. ప్రజాధనం వృథా కాకుండా చేయగలిగితే మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టవచ్చని, ప్రజలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నాలుగైదు రోజులకోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావాలని, ప్రతి మూడో సమావేశానికి అంటే ప్రతి 15 రోజులకోసారి ఉపసంఘంతో సీఎం భేటీ కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 45 రోజుల్లో నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు.