ఒకే ఒక్క ఛాన్స్‌ రసిక …

చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలిగిపోవాలని ఎందరో కలలు కంటుంటారు. ఒక్క అవకాశం ఇస్తే తమని తాము నిరూపించుకుంటామంటూ స్టూడియోలు, డైరెక్టర్‌లు, నిర్మాతల చుట్టూ తిరుగుతుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ అవ్వాలని వచ్చేవారు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారో ‘ఖడ్గం’లో సీతామహాలక్ష్మి పాత్ర చెప్పకనే చెబుతుంది. ‘ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌’ అంటూ తనదైన శైలిలో డైలాగ్‌ చెప్పి అందరినీ కట్టిపడేశారు సంగీత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారామె. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారు.  హాయ్‌ సంగీత.. ఎలా ఉన్నారు?
సంగీత: బాగున్నాను సంగీత సినిమా ఇండస్ట్రీకి తెలుసు..! మరి రసిక ఎవరు?
సంగీత: అది పెద్ద కథ. నేను వెండితెరకు పరిచయమైన సమయంలో అప్పటికే ఇండస్ట్రీలో ఒక సంగీత ఉన్నారు. రెండు పేర్లు ఉంటే తికమక పడతారని నా పేరు రసిక అని మార్చారు. రెండు మూడేళ్లు ఆ పేరుమీదే సినిమాలు చేశా. కానీ, ఆ పేరును నేను తీసుకోలేకపోతున్నా. షూటింగ్‌లో డైరెక్టర్‌ ‘రసిక.. రసిక’ అని పిలుస్తుంటారు. ఆ పేరుతో పిలిస్తే త్వరగా స్పందించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. సంగీత అనే మరో నటి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన వెంటనే నా పేరు నేను తెచ్చేసుకున్నా.  ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు?
సంగీత: అప్పుడు నేను చిన్న పిల్లను(నవ్వులు). నేను ఇండస్ట్రీకి వచ్చే సమయానికి నా వయసు 13ఏళ్లు. పదో తరగతి పరీక్షలు రాసి అప్పుడే ఇంటర్‌లోకి అడుగుపెట్టా. ఒక పక్క స్కూల్‌.. మరోపక్క సినిమా షూటింగ్‌లు ఇలా సాగేది.  మొదట మీరు ఏ భాషలో నటించారు?
సంగీత: నేను పుట్టి పెరిగింది అంతా మద్రాసులోనే! వెంకట్‌ ప్రభు సరసన ‘పూన్‌జొలై’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాను. వెంకట్‌ ప్రభు తండ్రి మాకు బంధువు అవుతారు. దీంతో సరదాగా సినిమా చేద్దామని నేను ఒప్పుకొన్నా. కేవలం సెలవుల్లోనే షూటింగ్‌ చేసేవారు.  తెలుగు ఎలా నేర్చుకున్నారు?
సంగీత: నేను తెలుగు మాట్లాడుతుంటే నాకు భయంగానే ఉంటుంది. ఎందుకో తెలియదు తెలుగుమీద ఒక విపరీతమైన లవ్‌. అందరూ చాలా ఈజీగా మాట్లాడతారు. నేను మాత్రం డైలాగ్‌ చదివి.. చదివి.. కష్టపడాల్సి వచ్చేది. దీంతో ఎలాగైనా ఈ భాష నేర్చుకోవాలనిపించింది. అందుకే పాటలు వింటూ, పుస్తకాలు చదువుతూ నేర్చుకున్నా. నాకు తెలిసిన వాళ్లు.. అసిస్టెంట్‌ డైరెక్టర్లతో ఎక్కువగా మాట్లాడేదాన్ని.  మొదటి తెలుగు సినిమా ఏది?
సంగీత: నా మొదటి తెలుగు సినిమా ఒక సూపర్‌స్టార్‌తో చేశా.(నవ్వులు) రజనీకాంత్‌ కన్నా మాస్‌. ఆరు అడుగులు ఉంటారు. ఆయన డైలాగ్‌ పేపర్‌ కూడా ఇవ్వనవసరం లేదు. ఒక్కసారి విని సింగిల్‌ టేక్‌లో చేసి, సీన్‌ చింపేస్తారు. (మధ్యలో ఆలీ అందుకుని.. ఒక్కసారి నాకూ చూపించండి నేను వెళ్లి కలుస్తా) ఇంకెవరు.. మీరేనండీ(ఆలీ)! మీ కుటుంబంలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు ఉన్నారా?
సంగీత: మా తాతగారు తమిళంలో పెద్ద ప్రొడ్యూసర్‌. ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌లతో ఆయన దాదాపు 20కు పైగా సినిమాలు చేశారు. మాకు సినిమా థియేటర్‌ ఉంది. మా అమ్మ చాలా అందంగా ఉంటారు. ఎంజీఆర్‌గారు ఒక సినిమాకు హీరోయిన్‌గా చేయమని మా అమ్మను అడిగారు. అయితే, మన ఇంటి అమ్మాయి నటించడం ఏంటని 16ఏళ్ల వయసులో పెళ్లి చేసేశారు. తను నటించలేకపోయాననే కల కలగానే మిగిలిపోయింది. దీంతో నన్ను హీరోయిన్‌గా చూడాలనుకున్నారు. అయితే, నాకు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదు. నేను బాగా చదువుకోవాలని అనుకున్నా. లండన్‌, అమెరికా వెళ్లి ఎంఎస్‌ చేయాలనుకున్నా. కానీ, అమ్మ కోరిక వల్ల చదువుకోలేకపోయా.  ‘ఆశల సందడి’లో అవకాశం ఎలా వచ్చింది?
సంగీత: నాకు అవకాశం ఎలా వచ్చిందో తెలియదు. మా అమ్మ వచ్చి ‘రేపు మనం ఫలానా షూటింగ్‌కు వెళ్తున్నాం’ అని చెప్పారంతే. నేను ‘సరేనన్నా’. అంతే తెలుసు. అవకాశం ఎలా వచ్చిందో కూడా తెలియదు. ‘ఖడ్గం’ వరకూ నా లైఫ్‌లో ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు. నిర్ణయాలు కూడా నేను తీసుకోలేదు.  ఖడ్గం’లో ఒక్క ఛాన్స్‌ అన్నట్లు రియల్‌ లైఫ్‌లో ఎవరినైనా అడిగారా?
సంగీత: 
ఆ సినిమా చేసే సమయానికి నాకు పెద్దగా హిట్లు లేవు. నేను 13ఏళ్ల వయసులో నటించడం మొదలు పెడితే, 21 సంవత్సరాల వరకూ నాకు సరైన విజయం లభించిన ఒక్క సినిమా కూడా లేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నా, ఒక్కటీ ఆడలేదు. నాకే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. నాకు సినిమా ఇండస్ట్రీ సరిపోదేమోనని ఒక భయం ఏర్పడింది. అలాంటి సమయంలో కృష్ణవంశీగారు పిలిచి ఈ సినిమాలో ఆఫర్‌ ఇచ్చారు. అది చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ సీన్‌ చేసినప్పుడు కూడా ఆ ఆవేదన నా గుండెల్లో నుంచి వచ్చింది. థియేటర్‌లో చూసినప్పుడు ‘మన పరిస్థితి కూడా మహాలక్ష్మిలాగే కదా’ అనిపించింది. అసలు నాకు ఆ పాత్ర గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నా. వంశీగారు చూపించిన దానిలో నిజం ఉంది. అంతకుముందు ఆ పాత్ర చేయమని చాలామందిని అడిగారట. ఎవ్వరూ ఒప్పుకోలేదు. ‘మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను మనమే చూపిస్తే బాగుండదు కదా’ అనే ఉద్దేశంతో ఎవరూ నటించడానికి ముందుకు రాలేదు. ఒక అమ్మాయికి హీరోయిన్‌గా అవకాశం రావాలంటే కొన్ని సందర్భాల్లో అలా చేయక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులను చూపిస్తే తప్పేంటి అనిపించింది.  మీ అమ్మ ఎలా ఉన్నారు?
సంగీత: 
నన్ను నసపెడుతూ బాగున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె ఏ చెబితే అది చేశా. ఒక వయసు వచ్చిన తర్వాత మనకూ ఆలోచించే శక్తి వస్తుంది. దాంతో వాళ్లు చెప్పింది చేయపోతే, హర్ట్‌ అవుతారు. తను చెప్పింది చేయడం లేదని ఒకరకమైన కోపం వచ్చేస్తుంది. వాళ్ల కంట్రోల్‌ నుంచి మనం వెళ్లిపోతున్నామంటే ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చేవారికి నేను చెప్పేది ఏంటంటే.. దయ చేసి చిన్నప్పుడే హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకోకండి. ఒక మెచ్యురిటీ లెవల్‌ వచ్చిన తర్వాతే ఇండస్ట్రీకి రండి. మీ కెరీర్‌ను మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో ఒక క్లారిటీ ఉన్నప్పుడే రండి. మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా మీరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది.  మీది ప్రేమ వివాహమా?
సంగీత: 
మాది ప్రేమ వివాహమే. నా జీవిత భాగస్వామిని నేనే ఎంపిక చేసుకున్నా. ఎందుకంటే నా పెళ్లి విషయంలో నేనే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా.  పెళ్లి చేసుకునే ముందు మీ భర్తను ఇంటర్వ్యూ చేశారట!
సంగీత:
 (నవ్వులు) ఆయనను నేను ఒక అవార్డు ఫంక్షన్‌లో చూశా. ఆయన ఇచ్చిన ప్రదర్శన నాకు బాగా నచ్చింది. చాలా బాగా మాట్లాడారు. ఆ ఫంక్షన్‌లో నేను, సిమ్రన్‌ పక్కనే కూర్చున్నాం. ‘ఆ మాట్లాడే వ్యక్తి ఎవరు’ అని తను నన్ను అడిగింది. ‘నాకు తెలియదు’ అని చెప్పా. ‘తను బాగా మాట్లాడుతున్నారు’ అంటూ సిమ్రన్‌ పొగడటం మొదలు పెట్టింది. ఆ పక్కనే మా అమ్మ ఉంటే, ‘ఇలాంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి. రియల్‌ ఎస్టేట్‌, విదేశాల్లో ఉన్నవాళ్లెవరూ వద్దు’ అని చెప్పా. ‘నీకన్నా వయసులో చిన్న వ్యక్తిలా ఉన్నారు కదా’ అని అమ్మ అంది. ‘అయితే ఏంటి? ఆయన నాకు నచ్చారు’ అని చెప్పా. ఆ రోజు సాయంత్రం అనుకోకుండా డిన్నర్‌ సమయంలో ఆయనను కలిశా. నేను ఆయనను అడిగిన మొదటి ప్రశ్న ‘మీ వయసెంత?’.  ‘30ఏళ్లు’ అని ఆయన సమాధానం ఇచ్చారు. అప్పుడు మా అమ్మ వంక చూస్తూ, ‘చూశావా! నాకన్నా రెండేళ్లు పెద్ద’ అని అన్నా. ఆ తర్వాత మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడం, పెళ్లి చేసుకోవడం అయింది. మాకు ఒక పాప. తమిళ హీరో విజయ్‌, మీరూ మంచి స్నేహితులట. తను మీ భర్తను ఇంటర్వ్యూ చేసి, ఓకే చెప్పిన తర్వాత పెళ్లి చేసుకున్నారు కదా!
సంగీత: 
అలా ఏమీ కాదు. నేను, విజయ్‌ మంచి స్నేహితులం. తను చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన తండ్రి మా తాతగారి ప్రొడక్షన్స్‌లో పనిచేశారు. ‘పేరు పాడుచేసుకోకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లాలి’ అని ఎప్పుడూ నాతో చెబుతుంటారు. ‘నాకే ఎందుకు చెబుతున్నావ్‌’ అని అడిగితే, ‘నువ్వు చాలా డిఫరెంట్‌. నీ కెరీర్‌ నాశనం కావడం నాకు ఇష్టం లేదు’ అని అనేవాడు. నేను క్రిష్‌(సంగీత భర్త)ను ప్రేమిస్తున్నప్పుడు విజయ్‌కు కాల్‌ చేసి చెప్పా. ఇద్దరం కలిసి విజయ్‌ ఇంటికి వెళ్లాం. కొంచెం సేపు ఆయనతో మాట్లాడిన తర్వాత విజయ్‌ చాలా సంతోషించారు. ఈ కాలంలో చాలా మంది ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ, ప్రత్యేకంగా మన విషయంలో కేర్‌ తీసుకుని, ఎదుటివారు బాగుండాలని కోరుకునే వ్యక్తి విజయ్‌.  ఐదు సినిమాలు హీరో శ్రీకాంత్‌తో చేసి ఆయనను అన్నయ్య అని ఎందుకు పిలవాల్సి వచ్చింది?
సంగీత: 
(నవ్వులు)మీరు కూడా నాకు అన్నయ్యే! ఏదో మీ షో కాబట్టి మిమ్మల్ని సర్‌ అని పిలుస్తున్నా. నేను అందరిలా హాయ్‌.. బై టైపు కాదు.. చాలా ఎమోషనల్‌. నా రియల్‌ లైఫ్‌లో చాలా మిస్‌ చేసుకున్నా. అలాంటి విషయాలను నేను ఇలా మార్చుకుంటూ ఆనందపడుతుంటా. నేను పనిచేసిన వారిలో శ్రీకాంత్‌ అన్నయ్య బెస్ట్‌. ఆయన కుటుంబం కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఆయనతో షూటింగ్‌ సందర్భంగా ఒక ఫన్నీ సన్నివేశం జరిగింది. ‘సంక్రాంతి’ సినిమాలో మా ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్‌ సీన్‌ ఉంది. అందులో మేమిద్దరం భార్యభర్తలం. ఒక సీన్‌లో మేమిద్దరం చాలా దగ్గరగా ఉండాలి. ఆ తర్వాత ఆ సీన్‌ సాంగ్‌కు వెళ్లిపోతుంది. ఆ సీన్‌ చేసే ముందు.. ‘మీరు ఇలా నా దగ్గరకు వస్తారు కదా అన్నయ్యా.. ఇలా ముద్దు పెడతారు కదా అన్నయ్యా.. నేను అలా తిరిగి సిగ్గుపడతా అన్నయ్యా’ అని చెబుతుంటే, ‘ఏయ్‌ ఛీ ఆపు.. అన్నయ్యా.. అన్నయ్యా.. దరిద్రంగా ఉంది’ అని డైరెక్టర్‌ వైపు తిరిగి ‘సర్‌ మీరైనా చెప్పండి. ఇలాంటి సీన్‌ చేసేటప్పుడు అన్నయ్యా.. అన్నయ్యా.. అని వందసార్లు అంటోంది. నాకు అదోలా ఉంది’ అని అనడంతో అందరూ ఒకటే నవ్వులు. నిజంగా అలా పిలుస్తూ ఆ సీన్లు చేయాలంటే కొంచెం కష్టమే! (నవ్వులు)  మీరు డ్యాన్స్‌ నేర్చుకున్నారా?
సంగీత: 
అవును! నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. సూర్య, విక్రమ్‌, ధనుష్‌ నా డ్యాన్స్‌ క్లాస్‌మేట్స్‌. ‘శివపుత్రుడు’లో ఎలా అవకాశం వచ్చింది?
సంగీత:
 తెలుగులో ‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాలతో మంచి పేరు వచ్చింది. తమిళ్‌లో మాత్రం అపజయాల నుంచి బయట పడలేకపోయా. బాలా సర్‌ పిలిచి నాకు ఆఫర్‌ ఇచ్చినప్పుడు నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే తెలుగులో నేను ఎనిమిది సినిమాలకు సైన్‌ చేశా. ఆయన వందరోజులు కాల్‌షీట్‌ అడిగారు. ‘నా వల్ల కాదు’ అని చెప్పా. ‘నువ్వు ఆ సినిమాలన్నీ వదిలేసి వచ్చి, ఈ సినిమా చేస్తే, నీ కెరీర్‌లో అద్భుతమైన సినిమా అవుతుంది’ అని చెప్పారు. ‘మీరు చెప్పేది నిజమే కానీ, నా వల్ల కాదు.. నేను అలా చేయలేను’ అన్నా. అయితే, ఆ సినిమా ఆఫర్‌ వద్దనుకున్నందుకు చాలా ఫీలయ్యా. సరిగా నిద్ర కూడా పట్టలేదు. వారం రోజుల తర్వాత ఆయనకు ఫోన్‌ చేసి, ‘సర్‌ మీ సినిమా చేయలేకపోయాను. నన్ను క్షమించండి. తర్వాత సినిమా చేసేటప్పుడు నాకు ముందే చెప్పండి. ఏడాది పాటు కాల్‌షీట్‌ కావాలన్నా ఇచ్చేస్తా. నాకు డబ్బులు కూడా వద్దు ’ అని చెప్పా. అంతా విని, చాలా సింపుల్‌గా ‘అదంతా సర్లే.. ఇప్పుడు ఏం చేస్తున్నావ్‌’ అన్నారు. ‘ఒక షూటింగ్‌కు హైదరాబాద్‌ వచ్చా. షెడ్యూల్‌ క్యాన్సిల్‌ అయిపోయింది. చెన్నై వెళ్తున్నా’ అని చెప్పా. ‘చెన్నై వద్దు..మధురై వచ్చేసెయ్‌’ అన్నారు. సర్లేనని వెళ్లా.  నా గెటప్‌ మొత్తం మార్చేశారు. చాలా డీగ్లామర్‌గా తయారు చేశారు. బ్లాక్‌ మేకప్‌ వేసి, చీరకట్టి, నోట్లో పాన్‌ వేశారు. అది చూసి నేను క్యారవాన్‌ నుంచి బయటకు రవడానికి కూడా భయపడ్డా. డైరెక్టర్‌గారిని రమ్మని చెప్పా. ఆయన వచ్చి, ‘ఈ అమ్మాయిని ఇలా తయారు చేశారేంటి? మొత్తం మేకప్‌ తీసేసి, నేచురల్‌గా చేసి తీసుకురండి’ అని అంటారనుకున్నా. ఇంతలో బాలా సర్‌ వచ్చి, ‘ఏంటీ ఈ అమ్మాయి ఇంత బ్రైట్‌గా ఉంది. ఇంకా డీగ్లామర్‌గా చేయండి’ అన్నారు. నా గుండె పగిలిపోయింది. ‘ఈ సినిమా అవసరమా’ అని లోపల అనుకున్నా. దిగులుగా సెట్‌కు వెళ్లా. అక్కడకు వెళ్లగానే, మొదట విక్రమ్‌ను చూశా. నాకన్నా చండాలంగా ఉన్నారు. దారుణమైన మేకప్‌. చిరిగిన బట్టలు కట్టుకున్నారు. మరోవైపు తిరిగి చూస్తే, సూర్య కూడా అలాగే ఉన్నారు. ‘హమ్మయ్యా! నేను ఒక్కదాన్నే అనుకున్నా. అందరూ దరిద్రంగానే ఉన్నారు’ అనుకుంటూ నటించడం మొదలు పెట్టా. వాళ్లతో పోలిస్తే, నేను కాస్త బాగున్నా. (నవ్వులు) సెట్‌లో బాలాగారు ఏం చెబితే అదే ఫైనల్‌. లేకపోతే బయటకు పొమ్మంటారు. మొదటి సీన్‌ చేసిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. నన్ను ఒకే చేశారు. అప్పటివరకూ 13మంది హీరోయిన్లు వచ్చి ఆ సీన్‌ చేశారట. చివరిగా నేను సెలక్ట్‌ అయ్యా. ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలా సర్‌కు కృతజ్ఞతలు.  చందమామ’లో అవకాశం వచ్చిందా?
సంగీత: 
అవును! అప్పుడు సినిమాలు వద్దనుకుని, లండన్‌ కాలేజ్‌కు దరఖాస్తు చేసుకున్నా. ఆ రోజు కృష్ణవంశీగారి దగ్గరి నుంచి కాల్‌ వచ్చింది. ఆ తర్వాత వెళ్లి కలిశా. అయితే, ఈ సినిమాకు తీసుకోవాలని కృష్ణవంశీ అనుకోలేదట. భరద్వాజ గారు సిఫారసు చేస్తే పిలిపించారు. మేకప్‌ టెస్ట్‌ చేస్తే, దరిద్రంగా ఉన్నా. అంతా అయిపోయిన తర్వాత కృష్ణవంశీగారి దగ్గరకు వెళ్లా. నేను ఒక పక్క మాట్లాడుతుంటే ఆయన మాత్రం టీవీలో ఏదో వీడియో చూస్తూ ఉన్నారు. కొంచెం సేపు అయిన తర్వాత నన్ను కూడా ఆ వీడియో చూడమన్నారు. అది నా మేకప్‌ టెస్టు వీడియో. నాకు కూడా నచ్చలేదు. వెంటనే ‘సర్‌! మీరు వేరే హీరోయిన్‌ను చూసుకోండి. మీ సినిమాను నాశనం చేయడం ఇష్టం లేదు’ అని చెప్పా. ఆయన నవ్వారు. ‘నీలో ఉన్న డ్రాబ్యాక్స్‌ ఏంటో నాకు తెలుసు. నేను సరిచేస్తా’ అనడంతో నేను సంతోషంగా ఆయన సినిమా చేస్తున్నాననుకుని ఇంటికి వెళ్లిపోయా. ఆ సినిమాకు ‘మల్లెపువ్వు’ అని పేరు పెట్టారు. అయితే, అది సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత నేను లండన్‌ వెళ్లిపోయా. కొన్ని రోజులకు ‘ఖడ్గం’ ప్రారంభమైంది. అన్ని పాత్రలకూ అందరూ సెట్‌ అయ్యారు. కానీ, మహాలక్ష్మి పాత్రకు ఎవరూ దొరకలేదు. అప్పుడే ఎవరో నా గురించి చెప్పారట. వెంటనే నన్ను పిలిపించి, అవకాశం ఇచ్చారు.  ‘మనోహర్‌’ సినిమా చేయడానికి డాక్టర్‌ సలహా తీసుకున్నారట! 
సంగీత:
 అది అక్రమ సంబంధం నేపథ్యంగా సాగే సినిమా. ఒక వదిన మరిది మీద ఆశ పడుతుంది. మనకు కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయి కదా! ఆ పాత్ర గురించి డైరెక్టర్‌ చెప్పగానే కోపం వచ్చింది. తిట్టేశా కూడా. ‘మేడమ్‌ ఇది నా రియల్‌లైఫ్‌ స్టోరీ’ అనడంతో ఆశ్చర్యపోయా. నాకు ఆలోచించుకునే సమయం ఇవ్వమని అడిగా. అప్పుడు ఒక సైక్రియాట్రిస్ట్‌ దగ్గరకు వెళ్లా. నాకు వచ్చిన పాత్ర గురించి చెప్పా. ‘ఇలా కూడా ఉంటారా’ అని అడిగినందుకు దాదాపు పది, పదిహేను ఫైల్స్‌ నా ముందు పెట్టింది. మనుషులు ఎలా ఉంటారో కొన్ని ఉదాహరణలే అని చెప్పింది. అది చదివిన తర్వాత ఆశ్చర్యపోయా. ‘ఇలాంటి పాత్ర చేయడం మంచిదేనా. జనాలు ఎలా తీసుకుంటారు?’ అని అడిగితే, ‘సినిమాలో ఇది తప్పు అని చూపిస్తున్నారు కదా! ఫర్వాలేదు. అందరికీ అవగాహనలా ఉంటుంది’ అని చెప్పడంతో ఒప్పుకొన్నా. తమిళంలో చాలా బిగ్‌ హిట్‌ అయింది.  లిఫ్ట్‌ గురించి మీ అభిప్రాయం ఏంటి?
సంగీత: (
నవ్వులు) అప్ట్లో నేను, నా ఫ్రెండ్‌ డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లే వాళ్లం. సరిగ్గా మాకు క్లాస్‌లు జరిగే పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతున్నారు. ఆ రోజు డ్యాన్స్‌ క్లాస్‌కు త్వరగా వచ్చేయడంతో ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్‌ ఎక్కి సిటీ వ్యూ చూద్దామని అనుకున్నాం. లిఫ్ట్‌ ఎక్కిన తర్వాత సగంలో ఆగిపోయింది. ఎవరో ఆఫ్‌ చేశారు. అప్పటికే చాలా ఎత్తులో ఉన్నాం. మేము అరిచినా ఎవరికీ వినిపించడం లేదు. నా ఫ్రెండ్‌ ఒకటే ఏడుపు. ఎవరైనా ఏడుస్తుంటే, నాకు నవ్వడం అలవాటు. దాదాపు గంటపాటు మేము పైనే ఉన్నాం. ఎవరికీ తెలియకుండా ఇంటికి వెళ్లిపోదామనుకుంటే ఆ విషయం తెలిసిపోయింది. మా అమ్మ నన్ను బాగా కొట్టింది.  సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలనుకుంటున్నారా?
సంగీత:
 అవును! నేను హీరోయిన్‌గా ఉన్నప్పుడే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశా. ఇప్పుడు నేను ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధమే. 

Leave a Response