అమరావతి భూముల సమీకరణ వ్యవహారంపై విచారణ జరిపిస్తామంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. దీంతో .. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన రెడ్డి సచివాలయం నుంచి విధులను నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. కొందరు జగన్ తన నివాసం నుంచే పాలన సాగిస్తారని చెబుతుంటే .. మరికొందరు హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తారంటూ ప్రచారం చేశారు. అయితే.. వీటన్నింటికి చెక్ పెడుతూ .. శుక్రవారం నుంచి సచివాలయంలోని తన చాంబర్లో జగన్ పాలన సాగించనున్నారు. బుధవారం మాజీ ఎంపీ, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు సచివాలయం వచ్చారు.
ఆయనతో భేటీ అనంతరం అదే బ్లాక్‌లోని ముఖ్యమంత్రి చాంబర్‌ను పరిశీలించారు. వాస్తు పరంగా ఏమైనా మార్పులూ చేర్పులూ చేయాలా అని సుబ్బారెడ్డిని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అడిగారు. సీఎం చాంబర్ అంటే వాస్తు ప్రకారమే నిర్మిస్తారని .. అందువల్ల కొత్తగా మార్పులూ చేర్పులూ అవసరం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లోకి జగన్ అడుగుపెడతారు. ద్వితీయ విఘ్నం ఉండకూడదన్న సలహా మేరకు శనివారం సెలవు రోజయినా .. అక్కడ కొద్దిసేపు గడుపుతారు.