ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం. బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలవడంతో కాషాయ గూటికి చేరడతాడంటూ ప్రచారం జరిగింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో వైసీపీలో చేరడం ఖాయమని అనుకున్నారు. సరిగ్గా దీపావళి రోజే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి లేఖ రాసిన వల్లభనేని వంశీ, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండుసార్లు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో అతికష్టంమీద గెలిచానన్న వంశీ, తనకు వ్యతిరేకంగా కొందరు ఉద్యోగులు, వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అనేక సమస్యలు చుట్టుముట్టాయని, రాజకీయంగా వేధిస్తూ, తన అనుచరులపై కేసులు పెడుతున్నారంటూ బాబుకి రాసిన లేఖలో చెప్పుకొచ్చారు. తన అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, అందుకే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ వెల్లడించారు. వంశీ లేఖపై స్పందించిన చంద్రబాబు, రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, తాను పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా అక్రమ కేసులు, వేధింపులు ఆగవన్న చంద్రబాబు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఐక్యంగా పోరాడదామంటూ వంశీకి పిలుపునిచ్చారు. అయితే, బాబు రియాక్షన్ పైనా వంశీ స్పందించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తనపై తీవ్ర ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గలేదని, అయితే కనబడే శత్రువుతో యుద్ధం చేయొచ్చు, కానీ కనబడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమంటూ తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చిచెప్పారు.జగన్ ను కలిసొచ్చాక ప్రభుత్వంపైనా, వైసీపీ నేతలపైనా వల్లభనేని వంశీ ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. తనను రాజకీయంగా వేధిస్తున్నారని, తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అందుకే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. పైగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.