హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు – కేటీఆర్

TRS win in Huzoor Nagar - KTR

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ హుజూర్ నగర్ పై ఉంటుందని అంతా భావించారు. ఒకపక్క ఆర్టీసీ సమ్మె, మరోపక్క విపక్షాల మూకుమ్మడి దాడి, ఇంకోవైపు సీపీఐ మద్దతు ఉపసంహరణ. ఇలా నలువైపులా నుంచి ప్రత్యర్ధులు చుట్టుముట్టడంతో ఇక, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు అనుమానమేనన్న చర్చ నడిచింది. కానీ అందరి అంచనాలను ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేశాయి. హుజూర్ నగర్ లో అసలు ఆర్టీసీ సమ్మె ప్రభావం లేనే లేదని తేల్చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించాయని ప్రకటించాయి. ఒకపక్క మిషన్ చాణక్య, మరోవైపు ఆరా, ఈ రెండు సర్వే సంస్థలు కూడా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయమని తేల్చేశాయి. మిషన్ చాణక్య సంస్థ టీఆర్ఎస్ కు 53.37శాతం ఓట్లు వస్తాయని చెబితే, ఆరా 50.48శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. అంతేకాదు ప్రతి మండలంలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి స్పష్టమైన ఆధిక్యం కనబర్చాడని తమ సర్వేల్లో తేలిందని ప్రకటించాయి. ఇక, అధికార టీఆర్ఎస్ కు ఒక్క కాంగ్రెస్ మాత్రమే పోటీ ఇఛ్చిందన్న సర్వే సంస్థలు, మిషన్ చాణక్య 41.04శాతం, ఆరా 39.95శాతం ఓట్ షేర్ ఇచ్చాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నడిచినప్పటికినీ, గులాబీ పార్టీ మాత్రం భారీ ఆధిక్యం సాధిస్తుందని ఇక, ఇతర పార్టీలేమీ కనీసం దరిదాపుల్లో కూడా లేవని ప్రకటించాయి. హుజూర్ నగర్ గెలుపుపై టీఆర్ఎస్ అధిష్టానంలో ధీమా వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే ట్వీట్ చేసిన కేటీఆర్‌, హుజూర్‌‌నగర్‌లో ఈసారి గెలుపు కారుదేనన్నారు. టీఆర్‌‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి, మంచి మెజారిటీలో విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేశారంటూ కేటీఆర్ ప్రశంసించారు. ఓటింగ్ సరళి, ప్రజానాడి, క్షేత్రస్థాయి సమాచారం, వివిధ సంస్థల సర్వేల ప్రకారం టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతోందని చెప్పారు. అక్టోబర్ 24న గెలుపెవరిదో తేలిపోనుంది.

Leave a Response