తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కథానాయికగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రోజా. ఒకప్పుడు వరుస సినిమాలో బిజీగా ఉన్న ఆమె ప్రస్తుతం రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క బుల్లితెరపై వివిధ షోలలో కనిపిస్తూ, వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. అయితే, తను హీరోయిన్గా ఉన్న సమయంలో ‘రథయాత్ర’ షూటింగ్‌కు చెప్పిన సమయానికి రాలేకపోయినందుకు సెట్లోనే కన్నీటిపర్యంతమయ్యారు.
‘‘ నేను షూటింగ్‌లకు ఎప్పుడూ ఆలస్యంగా రాను. నాకు ఇష్టం ఉండదు కూడా. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రథయాత్ర’లో నన్ను తీసుకున్నారు. అయితే, అప్పటికే నేను ఒక తమిళ చిత్రం చేస్తున్నా. అది అవుట్డోర్ షూటింగ్. అక్కడ టాకీ పూర్తయిన తర్వాత రెండు రోజుల పాటు కొడైకెనాల్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. ఆ రెండు రోజుల గ్యాప్‌లో నేను ‘రథయాత్ర’లో నటించాలి. అందుకు తమిళ సినిమా వాళ్లు కూడా మొదట ఒప్పుకొన్నారు. అందుకే నేను ‘రథయాత్ర’కు డేట్స్ ఇచ్చా. అయితే, నేను వెళ్లిపోతే, తిరిగి రానేమోనని ‘రథయాత్ర’ షూటింగ్‌కు వెళ్లకుండా నన్ను బ్లాక్ చేశారు. మరోపక్క ఆ చిత్ర నిర్మాత ఎస్.గోపాలరెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని తెలిసింది. మూడు రోజుల తర్వాత నేను ‘రథయాత్ర’ షూటింగ్ స్పాట్‌కు వెళ్లా. నాకు ఏమీ మాటలు రాలేదు. కళ్లవెంట నీళ్లు వచ్చేశాయి. ‘నా వల్ల పొరపాటు జరిగిపోయింది. షూటింగ్ చెప్పిన రోజుకు రాలేకపోయా’ అంటూ నేను ఏడుస్తుంటే, అది చూసి, నిర్మాత గోపాలరెడ్డి కూడా ఏడవటం మొదలు పెట్టారు.‘పోనీలే రోజా.. బాధపడకు.. షూటింగ్ మరో రెండు రోజులు ఆలస్యమవుతుంది అంతేగా’ అంటూ నన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పట్లో నేను చాలా సున్నితంగా ఉండేదాన్ని. ఎవరు ఏ చిన్న మాట అన్నా ఏడుపు వచ్చేసేది.’’ అంటూ ఆనాటి సంఘటనను ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు రోజా.