అవును… శుక్రవారంతో మహేశ్‌బాబులోని నటుడు 39 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అదేంటీ? మహేశ్ హీరోగా చేసిన ఫస్ట్ సినిమా ‘రాజకుమారుడు’ విడుదలైంది 1999లో కదా, అప్పుడే 39 ఏళ్లా? లెక్క తప్పారు అనుకుంటున్నారా? ఊహూ.. ఈ లెక్క మహేశ్ బాలనటుడిగా చేసిన సినిమాతో కలిపి. 1979లో మహేశ్‌కు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ‘నీడ’ అనే సినిమాలో ఓ రోల్ చేశారు. అంతేకాదు చైల్డ్ ఆర్టిస్టుగా ఆయన తొమ్మిది సినిమాల్లో నటించారు. ఇప్పుడు అర్థం అయ్యింది కదా, నటుడిగా మహేశ్‌కు 39 ఏళ్ల సినీ ప్రస్థానం ఎలా పూర్తయిందో.
ప్రస్తుతం కెరీర్‌లో 25వ చిత్రం ‘మహర్షి’తో బిజీగా ఉన్నారాయన. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. జయసుధ, సాయికుమార్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన విలేజ్ సెట్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు టీమ్. మరో 16 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని సమాచారం. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.