బట్టతల వచ్చేసింది.. ఇక పెళ్లెందుకు?

తనకు పెళ్లికాకుండానే బట్టతల వచ్చేసిందంటూ చమత్కరిస్తున్నారు బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌. సినీ నటి మలైకా అరోరాను అర్జున్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. అలాంటిదేమీ లేదని ఇద్దరూ ఎంతగా చెప్పినా ఈ వదంతులకు అడ్డుకట్ట పడటం లేదు. మీడియా వర్గాలు కూడా మాటిమాటికీ ఇదే ప్రశ్న అడుగుతున్నాయి.
దీని గురించి ఈసారి అర్జున్‌ తనదైన శైలిలో సమాధానమిచ్చి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్నారు. ‘సాధారణంగా పెళ్లయ్యాక పురుషులకు బట్టతల వస్తుందంటారు. కానీ నాకు ముందే బట్టతల వచ్చేసింది (తన తదుపరి సినిమాలోని గెటప్‌ను ఉద్దేశిస్తూ). అలాంటప్పుడు ఇక పెళ్లి చేసుకోవడమెందుకు? సరే.. ఇప్పుడు సీరియస్‌గా మాట్లాడుకుందాం. ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి. ప్రస్తుతం నేను ప్రేమలో చాలా సంతోషంగా ఉన్నాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ప్రశాంతంగా ఉన్నాను. సరిగ్గా తింటున్నాను. కంటినిండా నిద్రపోతున్నాను. ఇక నాకు జీవితంలో ఇంతకుమించి ఏం కావాలి?’ అని వెల్లడించారు అర్జున్‌. ప్రస్తుతం ఆయన ‘పానిపట్‌’, ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Leave a Response