సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, గత ఎన్నికల కంటే బీజేపీ, ఎన్డీఏకు మెరుగైన స్ధానాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ ఇంటిబాట పడతారన్న విపక్షాల విమర్శలను ఆయన తిప్పికొడుతూ మే 23న వారి కలలు భగ్నమవుతాయని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఓ వార్తాచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన విపక్షాలు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సాకులు వెతుకుతున్నాయని ఆరోపించారు.
విపక్షాల తీరు అవుటైన క్రీడాకారులు అంపైర్ ముందు నిరసన తెలిపిన చందంగా ఉందని విమర్శించారు. రాజకీయ పార్టీల ఆరోపణలపై ఈసీ స్పందిస్తున్న తీరు ప్రశంసనీయమని ప్రధాని పేర్కొన్నారు. 2014లో ఈసీ నిబంధనల మేరకు తన రోడ్డుషోలు రద్దయిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. తానెప్పుడూ ఈసీ నిర్ణయాలపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. మోదీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు విపక్షాల కూటమి యత్నాలు ఫలించలేదని ఎద్దేవా చేశారు. యూపీలో కాంగ్రెస్ కేవలం ఓట్లను చీల్చేందుకే పరిమితం కాగా, ఢిల్లీలో విపక్షాలు జట్టు కట్టలేదని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల ఓటు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కాషాయ కూటమికి విస్పష్ట మెజారిటీ లభిస్తుందని, తమకు ప్లాన్ బీ, సీ అంటూ ఏమీ లేవని తేల్చిచెప్పారు