నా ఫొటో చూసి నేనే భయపడ్డా

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా సినీ కెరీర్‌ ఆరంభంలోనే జాతీయ అవార్డు అందుకున్నారు. అయితే అప్పట్లో ఆమె చాలా బరువు ఉండేవారు. క్రమేపి తగ్గుతూ వచ్చారు. 2014లో రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. జిమ్‌లో శ్రమించి నాజూకుగా తయారయ్యారు. అప్పట్లో ఆమె లుక్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ క్రమంలో రెండేళ్లు సినిమాలకు సంతకం చేయకుండా ఉండటం గురించి పరిణీతి తాజాగా మాట్లాడారు.

‘నేను చాలా బరువు ఉండేదాన్ని. చూసేందుకు ఏ మాత్రం బాగోలేకుండా తయారయ్యా. ఓ రోజు నా ఫొటో చూసి నేనే భయపడ్డా. నన్ను నేను గుర్తు పట్టలేకపోయా. 26 ఏళ్ల అమ్మాయి ఇలా ఉండదు, ఉండకూడదు అనుకున్నా. ఓ నటిగా అలా ఉండే హక్కు నాకు లేదు. ఆ సమయంలో నా సినిమా ఒకటి ఫ్లాప్‌ అయ్యింది. దీంతో ‘బ్రేక్‌ తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మరికొన్ని నెలలు షూట్‌లో పాల్గొనకూడదు. బరువు తగ్గేందుకు కష్టపడాలి’ అనుకున్నా. వర్కవుట్‌లు చేశా’ అని ఆమె చెప్పారు. ఇటీవల ‘కేసరి’తో మంచి హిట్‌ అందుకున్న పరిణీతి చేతిలో ప్రస్తుతం దాదాపు ఐదు సినిమాలు ఉన్నాయి. సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ఆమె నటించిన ‘జబరియా జోడీ’ జులై 12న విడుదలకు సిద్ధమౌతోంది.

Leave a Response