ధోనీ అంత కోహ్లీకి లేదు!

విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా పరుగుల వరద పారించడంలో అతనికి అతనే సాటి. బ్యాట్స్‌మన్‌గా ఎదురైన రికార్డునల్లా కొల్లగొడుతూ పోతున్న విరాట్… మ్యాచ్‌ను మలుపు తిప్పే అంశంలో ధోనీ తర్వాతేనని మహీ చిన్ననాటి కోచ్ కేశబ్ రంజన్ బెనర్జీ అన్నాడు. ఎమ్‌ఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ క్లినిక్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బెనర్జీ పలు అంశాలను మీడియాతో పంచుకున్నాడు. మ్యాచ్‌ను అంచనా వేయడంలో ధోనీకి అపారమైన అనుభవముంది. ఈ విషయంలో కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బ్యాట్స్‌మన్‌గా పరుగులు సాధించటంలో సఫలమవుతున్న విరాట్ పరిస్థితులకు తగ్గట్లు వ్యుహాలు రచించడంలో విఫలమవుతున్నాడు. అందుకే ధోనీ నుంచి సలహాలు, సూచనలు అందుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఒకవేళ మహీ గనుక భారత జట్టులో లేకపోతే..కోహ్లీకి మద్దతుగా నిలిచేవారు ఎవరూ ఉండరు. అందుకే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి తలొగ్గకుండా నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవమున్న ధోనీ సహాయం అందుకోవాలి. ప్రపంచకప్‌లో మహీ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వస్తే..భారీ స్కోర్లు సాధించేందుకు ఆస్కారముంటుంది. క్రికెట్‌లో కొనసాగేందుకు ఫిట్‌నెస్ చాలా కీలకం అని బెనర్జీ అన్నాడు.

 

Leave a Response