జై శ్రీరాం అని నినదిస్తున్న తనను దమ్ముంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అరెస్ట్ చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సవాల్ చేశారు. వచ్చే ఆదివారం జరిగే తుది విడుత ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్లోని జోయానగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని క్యాన్నింగ్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నేను ఇక్కడ జై శ్రీరాం అని నినదిస్తున్నా. నేను రేపు కోల్‌కతాకు వస్తున్నా. ఒకవేళ మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని అన్నారు. ఎవరైనా జై శ్రీరాం అని నినదిస్తే మమతాదీదీకి ఆగ్రహం వస్తుందన్నారు. శ్రీరాముడి పేరును భారత్‌లో గాక పాకిస్థాన్‌లో పఠిస్తారా? అని అమిత్ షా నిలదీశారు. బెంగాల్లో ప్రచారం చేయకుండా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ నిలువరించగలరేమో గానీ, రాష్ట్రంలోని బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరని అమిత్‌షా స్పష్టంచేశారు. మమత ప్రభుత్వం కలవరపడుతున్నట్టు కనిపిస్తున్నదన్నారు. జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం పరిధిలోని బారుయిపూర్‌లో అమిత్ షా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు స్థానిక యంత్రాంగం అనుమతి నిరాకరించింది. దీనిపై మండిపడ్డ అమిత్ షా.. తన ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను కాపాడేందుకు మమతాబెనర్జీ ఆసక్తి చూపుతున్నారని ఆరోపించారు. కానీ తృణమూల్ పరాజయాన్ని ఆమె ఓటుబ్యాంకు ఆపలేదన్నారు.
చొరబాటుదారులు దేశీయ వనరులను చెదపురుగుల్లా తినేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో తమ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక బెంగాల్ నుంచి చొరబాటుదారుల్ని వెళ్లగొడతామని చెప్పారు. మేం బెంగాల్ కీర్తిని పునరుద్ధరిస్తాం. స్వర్ణ బెంగాల్‌ను మమతా బెనర్జీ.. నిరుపేద బెంగాల్‌గా మార్చేశారు అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాష్ట్రంలో సిండికేట్ రాజ్యం నడిపిస్తున్నారన్నారు. ఇంతకుముందు బెంగాల్లో సిండికేట్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాని స్థానే మేనల్లుడి ట్యాక్స్ వచ్చింది. భువా- భాతిజ అత్త, మేనల్లుడు లతో కూడిన అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపుతాం అని అమిత్‌షా చెప్పారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో అమిత్ షా సభలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్నారు. పశ్చిమబెంగాల్లో చివరి దశ ఎన్నికల్లో తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో వచ్చే ఆదివారం పోలింగ్ జరుగనున్నది.