కొత్త సర్కార్ ఏర్పాటులో.. కేసీఆర్ కీలకం!

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, ఢిల్లీలో మరోమారు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదన్న అంచనాల నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరిచే వ్యూహాలపై జాతీయ మీడియా గణనీయమైన ఆసక్తిని చూపుతున్నది. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించటమేగాక, వచ్చిన తెలంగాణను దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిపిన కేసీఆర్ అడుగులు ఎటువైపు పడతాయన్నదానిపై విశ్లేషణలు వెలువరిస్తున్నాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. హంగ్ పార్లమెంటు పరిస్థితి వస్తే.. బీజేపీయేతర పార్టీలను కేసీఆర్ కూడగట్టవచ్చని, తద్వారా ఢిల్లీలో కొత్త సర్కార్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపటం, ఎన్నికలకు ముందే ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలను ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్‌తో కేసీఆర్‌కు మంచి సంబంధాలున్నాయి. టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ కలిస్తే జాతీయ రాజకీయాల్లో గట్టిగా మాట్లాడే సామర్థ్యం ఆ కూటమికి లభిస్తుంది. తాజాగా కేసీఆర్ కేరళ సీఎం పినరాయి విజయన్‌ను, కర్ణాటక సీఎం కుమారస్వామిని, ఆయన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడలను కూడా కలిసి మాట్లాడారు. తద్వారా ఫెడరల్‌ఫ్రంట్ ప్రయత్నాలు మరోమారు ఊపందుకున్నాయి.

తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులతోనూ గతంలో కేసీఆర్ చర్చలు జరిపిన నేపథ్యంలో.. రానున్న జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించనున్నదన్న పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సంప్రదింపులు, చర్చలు ఒక ఎత్తయితే.. కేసీఆర్ వ్యూహాలు, సవాళ్లకు ఎదురెళ్లి అద్భుతమైన విజయాలు సాధించే ఆయన నైజం, అనూహ్యమైన ఎత్తుగడలు.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనను ప్రసుతం ఎవరూ ఊహించని స్థాయిలో నిలబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని జాతీయ మీడియాల్లో వస్తున్న విశ్లేషణలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రభ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ నుంచి బయటికొచ్చి టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లటం, తదనంతర కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్వరాష్ర్టాన్ని సాధించటం, తాజాగా ఏడాది ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయాన్ని సొంతం చేసుకోవటం.. వంటి పరిణామాల్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు విజయవంతమైతే.. దక్షిణాది నుంచి మూడో ప్రధానిగా కేసీఆర్‌ను చూసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Leave a Response