తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిజమైన తెలంగాణ వ్యక్తి కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ధైర్యముంటే నిజమైన తెలంగాణ వాడివని నిరూపించుకోవాల’ని కేసీఆర్‌కు సవాలు విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులుంటే.. వారికి రైతుబంధు లభించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ డీలర్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా చేశారని మండిపడ్డారు. రెండు లక్షల మంది ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు తమ సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఐఆర్ లేక ప్రభుత్వ ఉద్యోగులు, సమస్యలు పరిష్కారంచలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారని పొన్నాల తెలిపారు. గత ఎన్నికల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని వడ్డీ తీర్చలేని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్.. కాంగ్రెస్ ప్రకటించిన కొన్నిరోజులకు నిరుద్యోగ భృతి ప్రకటించారని గుర్తుచేశారు. జాగో బాగో చరిత్ర కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. తను ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే అని జోస్యం చెప్పారు.