చక్కటి నటనతో కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. తాజాగా ఆయన కొత్త సినిమా ఖరారైంది. నూతన దర్శకుడు పృథ్వీ ఆదిత్య స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తెరకెక్కించనున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ పతాకంపై ఐబీ కార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో రూపొందించనున్నారు. ఆది పినిశెట్టితో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ఆదిత్య అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఈ కథను రాస్తున్నప్పుడు నా మనసులో ఆది మెదిలారు. ఆయనకు కథ వినిపించిన తర్వాత నటించేందుకు ఒప్పుకోవడంతో చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆదితో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది. తప్పకుండా సినిమాను చక్కగా తీస్తాను. అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ ఇది. తను కన్న కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.