పీవీపీ కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు..!

వైసీపీ నేత పీవీపీ ఇంట్లో హల్ చల్ చేసిన కేసులో మరో నిర్మాత బండ్ల గణేశ్ పరారీలో ఉన్నట్టు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాకు పీవీపీ రూ. 7 కోట్ల ఫైనాన్స్ చేయగా, ఆ డబ్బులను బండ్ల గణేశ్ తిరిగి ఇవ్వలేదు. పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.గత రాత్రి పీవీపీ ఇంటిపై దాడి చేసిన బండ్ల గణేశ్, ఆయన అనుచరులు, పీవీపీని, ఆయన కుటుంబీకులను బెదిరించారు. దీంతో, జూబ్లీహిల్స్ పీఎస్ లో పీవీపీ స్వయంగా ఫిర్యాదు చేశారు. బండ్ల గణేశ్ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వెంటనే ఆయన ఇంటికి, కార్యాలయానికి వెళ్లగా, అక్కడాయన అందుబాటులో లేరు. బండ్ల గణేశ్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్ లను నియమించినట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.అయితే బండ్ల గణేశ్ పీవీపీ తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రక్షణ కోసం తాను పోలీసులను ఆశ్రయించానని, ఉదయం నుంచి పీవీపీ అనుచరులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని ఏపీ సీఎం జగన్ ను కోరుతు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు.”గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి… సార్ మమ్మల్ని అందరినీ పీవీపీ బారి నుంచి కాపాడండి. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్. ఓడిపోయిన కేసులలో కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే… ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు. అందరూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనందపడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు. వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి, నీకు చెడ్డ పేరు వస్తుంది.మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు, దయచేసి కట్టడి చేయండి” .తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇదే సమయంలో పీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు.

Tags:bandla ganeshpvp

Leave a Response